తదుపరి సీజేఐగా జస్టిస్ ఖేహర్
కేంద్రానికి లేఖ రాసిన ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఠాకూర్
- జనవరి 4న ప్రమాణం.. 44వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు
- పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం
- ఆగస్టు 27 వరకు ఆ పదవిలో కొనసాగనున్న ఖేహర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ బాధ్యతలు చేపట్టనున్నారు. న్యాయమూర్తుల నియామకం కోసం తెచ్చిన వివాదాస్పద జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయనే నేతృత్వం వహించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పదవీకాలం వచ్చే జనవరి 3న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అందరికంటే సీనియర్ అరుున జస్టిస్ ఖేహర్‌ను ఆ పదవిలో నియమించాలంటూ జస్టిస్ ఠాకూర్ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జస్టిస్ ఖేహర్ జనవరి 4న ప్రమాణం చేసి 44వ సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. దాదాపు 8 నెలలపాటు అంటే ఆగస్టు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దేశ చరిత్రలో సిక్కువర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.
పలు ధర్మాసనాలకు నేతృత్వం..
జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో పలు ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. ఎన్‌జేఏసీ కేసును విచారించిన ధర్మాసనానికి నేతృత్వం వహించడంతోపాటు గత జనవరిలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసిన ధర్మాసనానికి కూడా ఆయనే నేతృత్వం వహించడం గమనార్హం. అలాగే సహారా చీఫ్ సుబ్రతారాయ్‌ను జైలుకు పంపిన కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఇటీవల ఒకేరకమైన పనికి ఒకే వేతనం ఉండాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల కేసులో కీలక తీర్పిచ్చిన ధర్మాసనానికీ ఆయన నేతృత్వం వ్యవహరించారు.
ఇటీవల అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యలకు స్పందనగా, న్యాయవ్యవస్థకు లక్ష్మణరేఖ ఉందంటూ జస్టిస్ ఖేహర్ చెప్పడంతో.. జడ్జిల నియామకంపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఉన్న విభేదాలు మరోసారి ప్రస్ఫుటమయ్యారుు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు నేపథ్యంలో అన్ని సహజ నవరులను వేలం ద్వారానే విక్రరుుంచాలంటూ తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలోనూ జస్టిస్ ఖేహర్ భాగస్వామిగా ఉన్నారు. అలాగే ఏ సహజ వనరును కూడా చారిటీ, విరాళం పేరుతో ప్రైవేటుకు ధారాదత్తం చేయకూడదంటూ ఈ కేసులో ఆయన విడిగా రాసిన తీర్పులో స్పష్టంచేశారు. సహజ వనరులను దుర్వినియోగం చేయకూడదన్నారు.
అంచెలంచెలుగా...
పలు ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్న జస్టిస్ ఖేహర్.. అవినీతి కేసులో ఆరోపణలున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీడీ దినకరన్‌ను పదవి నుంచి తప్పించేందుకు రాజ్యసభ నియమించిన విచారణ కమిటీకి చైర్మన్‌గానూ పనిచేశారు. ఆయన సెప్టెంబర్ 13, 2011న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అంతకుముందు జస్టిస్ ఖేహర్ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, పంజాబ్-హరియాణా హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగానూ చేశారు. ఫిబ్రవరి 8, 1999న పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆగస్టు 28, 1952న జన్మించిన ఆయన పంజాబ్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొంది 1979లో న్యాయవాదిగా నమోదుచేసుకున్నారు. 1992 జనవరిలో పంజాబ్ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా, ఆ తర్వాత చండీగఢ్ సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా చేశారు. 1995 ఫిబ్రవరిలో సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. పలు యూనివర్సిటీలు, కార్పొరేట్ సంస్థలు, పలు కంపెనీలు, సహకార సంస్థలకు న్యాయవాదిగా ఉన్నారు.