నల్లడబ్బు, వదలని జబ్బు!
జస్టిస్ జీవన్‌రెడ్డి నాయకత్వంలో ఒక ప్రత్యేక పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేసి, నివేదికను నేరుగా తమకే అందచేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. నల్లధనం విషయంలో ప్రభుత్వం మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నదని ఆ బృందం అభిప్రాయపడింది.
నల్లధనం వెలికితీతకు బీజేపీ ప్రభుత్వం తాజాగా కమిటీని నియమించింది. ఇది కొత్త ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఈ 67 సంవత్సరాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు కమిటీ లను నియమించింది. అవి నివేదికలు ఇవ్వడం, వాటిని అటకెక్కించడం మామూలైపోయింది. ఆ కమిటీల సిఫారసులు అమలు పరిస్తే ఎంతోమంది పార్టీ నాయకుల, మంత్రుల తలలు తెగిపడవలసి వస్తుందని కాంగ్రెస్ భయం. అయితే పలువురు ప్రజా నాయకులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, ప్రతి పక్షాలు ఆందోళన చేయడంతో ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు, 2012లో కాబోలు, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అది భారతీయులు విదేశాల్లో, ముఖ్యంగా స్విస్ బ్యాం కుల్లో దాచుకున్న సంపద గురించి మాత్రమే.
రాజే అవినీతిపరుడైతే.....
దేశంలో ఎన్ని లక్షల కోట్ల నల్లధనం ఉందో మొన్నటి ఎన్నికల్లో వెల్లడైంది. అభ్యర్థులందరూ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారంటూ పత్రికల్లో వచ్చిన లెక్కలు అంచనాలే. అదంతా నల్లధనమే. ఈ నల్లధనం గురించి ప్రభుత్వాలు ఎందుకు కమిటీలు వెయ్యవు? కేంద్రప్రభుత్వం దేశంలో ఉన్న నల్లధనం గురించి కూడా ఒక కమిటీని నియమించాలి. బీజేపీ ప్రభుత్వం నియమించిన కమిటీ విదేశాల్లో చట్టరీత్యా, చట్ట వ్యతిరేకంగా దాచిన నల్లధనం గురించినదే. ఈ నల్లధనం విలువ ఎంతో వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు లెక్కలు విడుదల చేశాయి. ఫిబ్రవరి, 2012లో సీబీఐ డెరైక్టర్ ఇచ్చిన గణాంకాల ప్రకారం విదేశాల్లో దాచిన నల్లధనం విలువ 500 బిలియన్ డాలర్లు. ఇతర అన్ని దేశాల వారి కన్న భారతీయులే ఎక్కువ ధనం దాచుకొన్నారని స్విస్ బ్యాంకర్స్ అసోసియేషన్ అధికారులు 2011లోనే చెప్పారు. అయితే ఆ అధికారులే ఇవి తప్పుడు లెక్కలన్నారు గానీ, నిజమైన లెక్క చెప్పలేదు. 2011లో హెచ్ఎస్బీసీలో అకౌంట్లు ఉన్న 782 మంది పేర్లు ప్రభుత్వానికి చేరాయని, వాటిని వెల్లడించబోమని ప్రభుత్వం చెప్పింది. అయితే ఒక శ్వేత పత్రాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం స్విస్ ప్రభుత్వం నిర్ధారించిన లెక్కల ప్రకారం భారతీయులు స్విస్ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం 22.95 బిలియన్ రూపాయలు. భారతీయులు నల్ల ధనాన్ని ఒక్క స్విస్ బ్యాంకులోనే కాదు, ఇంకొన్ని చిన్నచిన్న దేశాల్లో కూడా దాచి పెడుతున్నారు. స్విస్ బ్యాంకు సహా, ఇలాంటి దేశాల్లో దాచిన నల్లధనం విలువ అంచనా 500 బిలియన్ డాలర్లని సీబీఐ డెరైక్టర్ ఫిబ్రవరి 2012లో వెల్లడించారు. అప్పుడే ఒక సందర్భో చితమైన సామెతను ఉటంకించారు. ‘రాజు అవినీతిపరుడైతే, ఆ దేశ ప్రజలు కూడా అంతే’.
సుప్రీంకోర్టు మండిపాటు
విదేశాల్లో నల్లధనాన్ని దాస్తున్న భారతీయుల పేర్లను బహిర్గతం చేయరాదని ప్రభుత్వం తీసుకున్న వైఖరిపై మాజీ న్యాయశాఖ మంత్రి, ఇతరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారి పేర్లు ఎందుకు ప్రకటించడం లేదని జనవరి, 2011న సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఓ ఆరు నెలలు ఆగి, జస్టిస్ జీవన్‌రెడ్డి నాయకత్వంలో ఒక ప్రత్యేక పరిశోధనా బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసి, నివేదికను నేరుగా తమకే అందచేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. నల్లధనం విషయంలో ప్రభుత్వం మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నదని ఆ బృందం అభిప్రాయపడింది. అధికారంలో ఉండి, డబ్బు చేసుకొని విదేశ బ్యాంకుల్లో దాచింది కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, వారిని బలపరిచే వ్యాపార, కార్పొరేట్లే. మరి, కాంగ్రెస్ తన కంటిని తానే పొడుచుకొంటుందా? అయినా సుప్రీంకోర్టు ఆదేశాన్ని కాదనలేరు. జర్మనీ ప్రభుత్వం పంపిన 26 మంది పేర్లను మన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది.
తేనెతుట్టెను కదల్చడం ఇష్టం లేకనే!
జస్టిస్ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు నల్లధనం వ్యవహారంలో ప్రభుత్వం ఎం త మెతక వైఖరినవలంబిస్తున్నదో గుర్రాల వ్యాపారి హసన్ అలీ వ్యవహారం చూస్తే తెలుస్తుంది. విదేశీ బ్యాంకుల్లో 380 బిలియన్ డాలర్లు దాచినట్లు వెల్లడై దేశ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అతన్ని అరెస్టు చేసింది. ఎప్పుడో 2007లోనే ఆదాయపు పన్ను శాఖ అతని ఇంటి మీద దాడిచేసింది కూడా. అయితేనేం, ప్రభుత్వం తదనంతరం తీసుకోవాల్సిన చర్యలను తీసుకోలేదు. ఇటీవలే ఈ ఫైల్ కదిలిందని వార్త. ఇలాంటి నేరాల పరిశోధనకు ఒకటి రెండూ కాదు, కేంద్ర పరిధిలోనే సుమారు పది సంస్థలున్నాయి. అయితే, ఒకస్థాయి అధికారులు, మంత్రుల విషయంలో ఎలాంటి ఆరోపణలు వచ్చినా, కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఒకవేళ విచారణకు అనుమతిస్తే, లేని తుట్టెను కదిలించినట్లవుతుంది. అందుకనే అంతా గప్‌చుప్.
అధికార పార్టీల బండారం
ఏ విషయం గురించైనా ప్రజల ఒత్తిడి మేరకో, తక్షణ చర్య తీసుకోవాల్సి వస్తే నో, ఆ సమస్య పరిష్కారం దిశగా ఓ కమిటీ వేయటం ప్రభుత్వాల అలవా టు. ఆ కమిటీ ఓ నివేదికను సమర్పిస్తుంది. పరిశీలిస్తున్నాం అంటుంది ప్రభు త్వం. ప్రజలు మరచిపోతారు. ఫైలు అటకెక్కుతుంది. ఆ కోవలోనిదే జూన్ 2011న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ అధిపతి ఎం.సి. జోషి నాయక త్వంలో నియమించిన కమిటీ. ఇది జనవరి 2012న నివేదికను అందజేసింది. ఆ కమిటీ కాంగ్రెస్, బీజేపీల బండారం బయటపెట్టింది. ఈ రెండు పార్టీలు ఎన్నికలలో రూ.1,000-1,500 కోట్లు ఖర్చు చేస్తాయి. కానీ, అధికారికంగా చూపించే వ్యయం కాంగ్రెస్ రూ. 500 కోట్ల్లు, బీజేపీ రూ. 200 కోట్లు. నేరం రుజువైతే చట్టంలో ఉన్న శిక్షా కాలాన్ని పెంచాలి. ఒక జాతీయ పన్నుల ట్రిబ్యునల్‌ను నియమించాలి. ఇలాంటి కొన్ని సూచనలు చేసినా, చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం కూడా పన్ను రేటు పెంచితే దొంగదారులు వెతుకుతారని, తగ్గిస్తే ప్రభుత్వ నియమాలు పాటిస్తారని చెప్పింది. ఇది కార్పొరేట్లు, బడా వ్యాపార సంస్థలకు అను కూలం. మొదట్లో పన్నురేటు సుమారు 80 శాతం ఉండగా, పెద్ద ఎత్తున పన్నులు చెల్లించే వారి ఒత్తిడి మేరకు సుమారు 30 శాతానికి తగ్గించింది. అయినా నల్లధనం పేరుకు పోతూనే ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నల్ల ధనం మోత బాగా వినబడుతోంది. ఇవి శ్వేతపత్రం సూచనలు. ఈ సూచ నలు నల్లధనం సృష్టిని నిరోధించగలవా? ‘నల్లధనం నిల్వలను స్వచ్ఛం దంగా ప్రకటించండి, మినహాయింపులిస్తాం!’ అని ఇదివరకో ప్రభుత్వం చెబితే, దానికి స్పందన దాదాపు శూన్యం. ఇదీ క్లుప్తంగా నల్లధనం నేపథ్యం.
అక్షింతల మీద అక్షింతలు
విదేశాల్లో నల్లధనం దాచుకొన్న వారిని రక్షించడానికి కాంగ్రెస్ నిస్సిగ్గుగా చేసిన ప్రయత్నాలు, సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా వ్యవహరించినందుకు ఫలితమే 2014 ఎన్నికల్లో ప్రజ లిచ్చిన తీర్పు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించిన ఈ తీరు మీదే ఇటీవల సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. జూలై 2011లోనే సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి నల్లధనాన్ని వెనక్కు రప్పించమని ఆదేశించినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. పైగా ‘సిట్’ ఏర్పాటు ఆదేశాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అప్పుడే ‘నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ నల్లధనాన్ని వెనక్కి తీసుకొని వస్తే ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవచ్చు. తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది’ అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అలాగే ‘మీరు విఫలమైతే కోర్టు ఆ పని చేయాల్సి వస్తుంది’ అని హెచ్చరించింది కూడా.
కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో!
సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత బీజేపీ ప్రభుత్వానికి మరోదారి లేక సిట్ ఏర్పాటును వెంటనే ప్రకటించాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ను చావగొట్టడానికి బీజేపీ ప్రభుత్వానికి అంది వచ్చిన ఆయుధమిది. ఎటొచ్చీ విదేశాల్లో నల్లధనం దాచిన వారిలో కార్పొరేట్ సంస్థలున్నాయి. వాళ్లు కోట్లు ఖర్చు పెట్టి వారి అభ్యర్థిని ప్రధానిగా గెలిపించుకున్నారు. సిట్ తాను ఇవ్వబోయే తీర్పులో ఆ కార్పొరేట్ల పేర్లను ఉదహరిస్తే ప్రధాని ఏం చేస్తారో చూడాలి.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు) వి.హనుమంతరావు