హైకోర్టు విభజనకు కమిటీ
చీఫ్ జస్టిస్ అధ్యక్షతన ఏర్పాటు
సభ్యులుగా జస్టిస్ మెహంతా, జస్టిస్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ భాను, జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్,
జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ ఇలంగో
ఈ నెల 23కల్లా నివేదిక?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన రోజయిన జూన్ 2కు ముందే రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఏర్పాటు చేసే విషయంలో సాధ్యాసాధ్యాల అధ్యయనానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ నెల 23వ తేదీ కల్లా కమిటీ ఓ నివేదికను తయారుచేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో జస్టిస్ అశుతోష్ మెహంతా, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ రాజా ఇలంగో సభ్యులుగా ఉంటారు.
మిగిలిన న్యాయమూర్తులందరూ సీల్డ్ కవర్లలో వారి అభిప్రాయాలను కమిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈమేరకు సోమవారం ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఇతర రిజిస్ట్రార్లు అందుబాటులో ఉండాలని, కమిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాల్సి ఉంటుందని ఆ ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. అపాయింటెడ్ డే దగ్గర పడుతుండటంతో హైకో ర్టు విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో తెలపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల హైకోర్టుకు లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో 3న హైకోర్టు న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్ కోర్టు సమావేశమైంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో లోపాలను ఎత్తిచూపుతూ, జూన్ 2లోగా రెండు హైకోర్టులు ఏర్పాటు చేయకపోతే రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని సీని యర్ న్యాయమూర్తి ఒకరు తన సహచరులను అప్రమత్తం చేశారు. దీంతో రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు, కిందిస్థాయి న్యాయాధికారులు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై కమిటీ వేయాలని ఫుల్‌కోర్టు నిర్ణయించి, ఆ బాధ్యతలను ప్రధాన న్యాయమూర్తికి అప్పగించింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి కమిటీని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభమవటం, పునఃప్రారంభం రోజే అపాయింటెడ్ డే ఉండటంతో కమిటీ నివేదికకు ఈనెల 23ను గడువుగా నిర్ణయించినట్లు సమాచారం.