అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సామాజిక అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం. ఎన్ రావ్ అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సోషల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీపీ మండల్ 98వ జయంతి సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనకబడిన వర్గాలకు చెందిన ఏ ఒక్క నాయకుడు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయలేదన్నారు. అయినా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మండల్ కమిషన్దేనన్నారు. దేశంలో 52శాతం బీసీలు, 27శాతం ఎస్సీలు, 12శాతం ఎస్టీలు, మైనార్టీలు ఉన్నా రాజ్యాధికారం చేజిక్కించుకోలేకపోతున్నారన్నారు.
మాజీ ఎంపీ మధుయాష్కి మాట్లాడుతూ అగ్రవర్ణాల నాయకులు వెనక బడిన వర్గాల వారికి రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నారన్నారు. సగం తెలంగాణ మాత్రమే సాధించుకున్నామని, దొరలపాలనను అంతమొందించేందుకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ కమిషన్ను ఏర్పాటుచేసి బీసీలకు హక్కులు కల్పించాలన్నారు. సింహాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావ్, కదిరే కృష్ణ, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్, చుక్కా సత్తయ్య, రాములు, బాబూరావ్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.