ఆకతాయితనంతోనే కుక్క పిల్లల సజీవ దహనం
- 8మంది మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం.
- మైనర్ల వయస్సు నిర్థారణ కోసం ఆసపత్రికి పంపాం.
- వారు జువైనల్ కావడం వల్ల మీడియా ముందు ప్రవేశపెట్టలేకపోతున్నాం.
హైదరాబాద్‌సిటీ
ఆకతాయి చేష్టలతోనే ముడు కుక్క పిల్లలను విచక్షణా రహితంగా సజీవదహనం చేశారని సెంట్రల్‌జోన్ డిసిపి వి.బి.కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటికే 8మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వయస్సు నిర్థారణ కోసం ఆసుపత్రిలో టెస్ట్‌లను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాలికల మిస్సింగ్ వ్యవహారంపై నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన డిసిపి వి.బి.కమాలన్‌రెడ్డి అబిడ్స్ ఏసిపి జె.రాఘవేందర్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు.
ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన దయారకమాన్ వద్ద ఉన్న స్మశానవాటికలో కొంతమంది మైనర్లు ప్రతి రోజు క్రికెట్ ఆడేందుకు వస్తారన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న మూడు కుక్క పిల్లలను వారు ఆకతాయితనంగా మంటల్లో వేసి కాల్చారన్నారు. ఈ ఘటనను వీడియో తీయడంతో ఎవరెవరు ఉన్నారన్నది గుర్తించామన్నారు. వీరి వయస్సు నిర్థారణ నిమిత్తం ఆసుపత్రిలో టెస్ట్‌లను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఘటనలో ఎవరైనా మేజర్లు ఉంటే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటి వరకు తమ విచారణలో భాగంగా 8మంది మైనర్లేనని చెప్పారు. వీరికి వీరి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ను కూడా ఇస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు మరోమారు పునరావత్తం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వారు జువైనల్స్ కావడం వల్ల ఈ వ్యవహారాన్ని తాము మీడియా ఎదుట ప్రవేశపెట్టలేకపోయామన్నారు.