సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఎస్టీఎస్ మహిళలు
సింగపూర్ : వివేకానంద్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో ఇండియన్ ట్రెడిషనల్ గేమ్స్ ఫెస్టివల్(ఐటీజీఎఫ్)2018 ఆటలపోటీలు జరిగాయి. సింగపూర్‌లోని బెడాక్ స్టేడియం నిర్వహించిన ఈ ఆటల పోటీల్లో సింగపూర్ తెలుగు సమాజం(ఎస్టీఎస్)కి చెందిన పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. లంగాడి(కుంటాట)లో ఎస్టీఎస్ మహిళల జట్టు విజేతగా నిలవగా, కోకో పోటీల్లో ఎస్టీఎస్ పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. అతిపెద్ద రంగోళి పోటీల్లో ఎస్టీఎస్ మహిళలు పాల్గొని సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సాధించారు. కోకో, కబడ్డీ వంటి ఆటల్లో ఎస్టీఎస్ పిల్లల జట్లు హుషారుగా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సింగపూర్ పార్లమెంట్ సభ్యులు చెరిల్ చాన్, హైకమిషనర్ ఆఫ్ ఇండియా జావెద్ అశ్రఫ్, సింగపూర్ తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ హాజరయ్యారు. వివేకానంద సేవా సంఘ్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని జ్యోతీశ్వర్ రెడ్డి అభినందించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరిని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి , కార్యదర్శి సత్య చిర్ల, కార్యనిర్వాక సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.