దేవరాగ బంధం
దేవరాగ బంధం
కొండవీటి జ్యోతిర్మయి... తాళ్లపాక అన్నమయ్య...
ఒకరిని తలవగానే ఒకరు స్ఫురణకొచ్చేస్తారు.
సంకీర్తన-సత్కర్మ కూడా ‘జ్యోతిర్మయి’కి సమానార్థకాలే!
ఎవరి అదృష్టం ఇది?
తెలుగు సంస్కృతిది, తెలుగు భక్తజనానిది.
ఇంకా... జ్యోతిర్మయిది కూడా!
గాత్రసేవా భాగ్యం అందరికీ దక్కేదా మరి?!
ఆమెకు దక్కింది.
ఇంకో భాగ్యం... చలపతిరావు.
జ్యోతిర్మయి జీవితభాగస్వామి.
‘‘నేనంటూ విడిగా లేను,
వీరిలోనే ఉన్నాను’’ అంటారాయన!
‘వీరు’ అనడం భార్యనుద్దేశించి!!
ఇదొక అవ్యక్తమైన అనుబంధం.
దేవరాగ భవబంధం.
పదకవితలు, శ్రుతిలయలతో సాగుతున్న
వీరి ఆధ్యాత్మిక దాంపత్యమే...
ఈవారం ‘మనసే జతగా...’
మీ దంపతులు ఈ దసరా నవరాత్రులను ఎలా జరుపుతున్నారు?
కొండవీటి జ్యోతిర్మయి: ప్రతి జిల్లా నుంచి తిరుపతికి పూలరథం తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాం.
చలపతిరావు: ఏ కార్యక్రమమైనా మేం చేస్తున్నట్టు కాదు! ఆ భగవంతుడే మా చేత చేయిస్తున్నాడు అన్నట్లుగానే చేస్తాం.
భక్తి ఇద్దరిలోనూ ఎక్కువే కనిపిస్తోంది. ఈ భావన మీలో ఎప్పటినుంచి మొదలైంది?
జ్యోతిర్మయి: చిన్ననాటి నుంచి. మా అమ్మ నోములు, వ్రతాలు, పూజలు... తను చేస్తూ నా చేత చేయించేది. ప్రతి పూజ వెనక పరమార్థాన్ని వివరించేది. దీనికి తోడు కర్నాటక సంగీతం, అన్నమాచార్య సంకీర్తన ఆధ్యాత్మిక భావనకు మరింత దగ్గర చేసింది.
చలపతిరావు: నేనూ మా పెద్దల నుంచే భక్తిని అలవర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి లలిత కళలు అంటే అమితమైన ఆసక్తి. కళ అంటే భగవంతుడి రూపంగా భావిస్తాను. వీరు (జ్యోతిర్మయి) గురూపదేశం తీసుకున్నాక భక్తి భావన మరింత స్థిరపడింది.
భార్యను ‘మీరు’ అంటున్నారు!! మీ పెళ్లి ఎక్కడ జరిగింది? అప్పటి సంగతులు చెబుతారా?
చలపతిరావు: స్త్రీని తల్లిలా పూజించాలి, గౌరవించాలి అనేది నా అభిమతం. స్వామి వీరిలో ఉన్నారు అందుకే ‘తల్లీ’ అని పిలుస్తుంటాను. ఇక పెళ్లంటారా... ఇది మేం చేసుకున్న కళ్యాణం కాదు. భగవంతుడు ముందే నిర్ణయించింది. మా ఇద్దరిదీ ఒకటే ఆత్మ. వారి(జ్యోతిర్మయి)లోనే నేను ఉన్నాను. దైవమే మమ్మల్ని నడిపిస్తుంది అనే నమ్మకం.
జ్యోతిర్మయి: మా కుటుంబం అంతా ఆ దైవాన్ని శరణు వేడుతాం. మేం చేసే ఏ కార్యక్రమమైనా ‘ఇది మేం చేయడం లేదు. మా చేత చేయించేవాడివి నువ్వు. మమ్మల్ని నడిపించేవాడివి నువ్వు.. నీదే భారం’ అనే భావనతోనే ఉంటాం. మాది పశ్చిమగోదావరి జిల్లా. వీరిది కృష్ణాజిల్లా! నేను వేదిక మీద పాడుతూ ఉండగా వీళ్ల కుటుంబం నన్ను చూశారు. ‘మీ అమ్మాయిని మాకివ్వండి చాలు, మరే కట్నకానుకలు వద్దు’ అన్నారు. అప్పటికే వీరు ఎం.ఎ చేశారు. అభినయ ఆర్ట్స్ పేరుమీద కళలను ప్రోత్సహించే పనిలో ఉన్నారు. వీరిది కూడా నాలాంటి మనస్తత్వమే అనిపించింది. అలా పద్నాలుగేళ్ల క్రితం మా పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది.
పెళ్లికి ముందే మీరు సంగీతంలో ప్రావీణ్యం పొందారు. ఎం.ఎ చేశారు. పెళ్లికి ముందు భవిష్యత్తు పట్ల మీకు అంచనాలేమీ లేవా?
జ్యోతిర్మయి: అంచనాలు ఉంటే అలా జరగకపోతే జీవితం బాధగా ఉంటుంది. అందుకే ఎలాంటి అంచనాలకూ తావివ్వలేదు. వీరూ అంతే! మా రెండు కుటుంబాలు పెళ్లి మాటలు మాట్లాడుకున్న తర్వాత మాత్రం వీరితో నేను ‘మన పెళ్లయిన తర్వాత, సంసార జీవితంలో పడిపోతే.. నేను ఇన్నాళ్లు చేసిన సాధన అంతా వృథా అయిపోతుందేమో!’ అని అనుమానం వ్యక్తం చేశాను. దానికి వీరు ‘నీ ఈ కళను మరింత వృద్ధి పొందేలా చేస్తాను. నీ సాధనకు సహకారమందిస్తాను’ అని మాట ఇచ్చారు. ఆ మాట మీదే నిలబడడంతో నేను సంకీర్తనాచారిణిగా ముందుకెళ్లగలిగాను. చిన్నప్పటి నుంచే కుటుంబంలో ఉండే కష్టనష్టాలేమిటో తెలుసు. పైగా మేం అప్పుడు ఎదుర్కొన్న ఆర్థిక ఒడిదుడుకుల వల్లే వైవాహిక జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఓ అవగాహన ఏర్పడింది. మేం మూడే నియామలు పెట్టుకున్నాం. నిజాయితీ, అంకితభావం, ఆధ్యాత్మికత.. వీటి వల్లే ఇలా ఉన్నాం.
భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి సహనం ఉండాలి, అప్పుడే కుటుంబం బాగుంటుంది అంటారు. ఇందులో నిజమెంత?
జ్యోతిర్మయి: నూటికి నూరుపాళ్లు నిజం. వీరికి ఎంత సహనం అంటే ఆ సహనానికి ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈయనే కాదు అత్తయ్య, మామయ్య, మరిది, మా పిల్లలు.. కుటుంబం అంతా ఇంతే! మా పెళ్లయిన ఇన్నేళ్లలోనూ మా అత్తయ్య ఒక్కసారి కూడా పరాకుగా, విసుగ్గా ఉండటం చూడలేదు. కన్నతల్లి కంటే మిన్నగా చూసుకుంది. నేను నా కచేరీలలో తలమునకలుగా ఉన్నప్పుడు మా ఇద్దరు పిల్లలను పెంచింది ఆమే! ఆమె నుంచే వీరికి అంత ఓపిక వచ్చిందనుకుంటాను. ఎంత ఒంట్లో బాగోలేకపోయినా ‘మంచినీళ్లు ఇస్తావా?’ అని కూడా ఇన్నేళ్లలో ఎప్పుడూ వీరు నన్ను అడగలేదు. ఇంట్లో ఓర్పు లేకపోతే బయట కూడా ఏమీ సాధించలేమన్నది వీరి తత్త్వం. కుటుంబం అనేది ఒక విద్యాసంస్థలాంటిది. ఇందులో ఎంతో బోధన ఉంటుంది. కుటుంబాన్ని ప్రేమిస్తే, ప్రపంచాన్ని ప్రేమించడం సులువు అవుతుంది. బహుశా అందుకే మన సంప్రదాయంలో కుటుంబ వ్యవస్థకి అంత ప్రాధాన్యత ఉన్నట్టుంది. మాకు మా పెళ్లి అయిన తేదీ, సంవత్సరం కూడా గుర్తులేదు. అంతేకాదు భౌతికంగా ఉండే ఏ సుఖాలతో మాకు సంబంధం లేదు. సినిమాలకు, షికార్లకు ఎన్నడూ వెళ్లింది లేదు. ఈ రోజు ఏం నేర్చుకున్నాం... ఎదుటివారికి ఏం చేశాం... ఇదే మా ఆలోచన.
చలపతిరావు: వీరి పుట్టినరోజు జనవరి 14. అది మాత్రం బాగా చేయడానికి ప్రయత్నిస్తాను. అంతే తప్ప కానుకలు ఇవ్వడం, పుచ్చుకోవడం అంటూ ఎన్నడూ చేయం.
తీరిక సమయంలో ఏం చేస్తుంటారు?
జ్యోతిర్మయి: నేను, వీరు, వూ అత్తగారు, వూవుగారు, వురిది మేం చేయబోయే కార్యక్రమాల గురించే చర్చించుకుంటాం. దేన్నీ ఆశించకుండా ఏం చేయాలనే తప్ప రేపు ఎలా గడుస్తుంది అని ఎన్నడూ అనుకున్నది లేదు.
చలపతిరావు: మా ఇద్దరిదీ ఒకటే ఆలోచన. అలాంటప్పుడు వేరే వాటి గురించి చర్చలే ఉండవు.
ఆర్థికవ్యవహారాలు ఎవరు చూస్తుంటారు?
చలపతిరావు: ప్రతిదీ నేనే అమర్చడానికి ప్రయత్నిస్తాను. ఏ ఒత్తిడి వీరిని అంటరాదు. అది నేను తీసుకున్న నిర్ణయుం. వీరి ప్రోగ్రామ్‌ల ద్వారా వచ్చే పారితోషికాన్ని సేవా కార్యక్రమాలకు, పాటల ఆల్బమ్‌లు చేయడానికి ఉపయోగిస్తాం. ఆస్తులు సంపాదించాలని, వెనకేసుకోవాలనే ఆలోచన ఏ మాత్రం లేదు. వీరికి ఎన్నడూ ఏమీ కొనిపెట్టింది లేదు. వీరు కోరి కొనుక్కున్నదీ లేదు.
పిల్లలపెంపకంలో ఎవరి పాత్ర ఎక్కువ?
జ్యోతిర్మయి: పిల్లలకు ఫస్ట్‌క్లాసు రావాలని, మార్కులు బాగా రావాలని ఒత్తిడి పెట్టం. చదువు విషయంలో పిల్లల ఇష్టానికే ప్రాధాన్యం. నేను యూవరేజ్స్టూడెంట్ని. అలాగే నా పిల్లలు కూడా! తెలివికి మార్కులు కొలమానం కాదన్నది నా అవగాహన. సమాజం, మనుషులు... వారి పట్ల ప్రవర్తన. మంచి సంస్కారం వస్తే చదువు దానంతట అదే వస్తుంది. చదువు సంపాదన కోసం కాదు జ్ఞానం కోసం. పిల్లల ముందే కాదు ఇంట్లో ఎవరినోటా ప్రతికూలంగా ఒక్క మాట రాదు. అలా రావడాన్ని ఇష్టపడం.
ఆధ్యాత్మికత సాధనలో పెళ్లి ఒక జంఝాటం.. అంటారు కదా!
జ్యోతిర్మయి: సంసారం జంఝాటం కాదు. సాధనకు ఒక మెట్టు. చాలావుంది పెళ్లి చేసుకోకుండా ఉన్నవారినీ చూస్తున్నాం. పెళ్లి చేసుకున్నాక దాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమూ చూస్తున్నాం. ఎందుకంటే వారికి సమతూకం తెలియదు. పెళ్లి ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది మాత్రమే కాదు. వునకు కొంత సహనం, కొంత వాత్సల్యం, రాబోయే తరం బాగుండాలి అనే ఆలోచన... ఇవన్నీ ఉండాలి. దేవుడిమనిషి కావాలంటే కుటుంబంలోనే ఇవన్నీ లభిస్తాయి. వంట చేసినా, ఊడ్చినా, తుడిచినా.. ఏదైనా సాధన కోసం ఇచ్చాడు. భగవత్కార్యంగా భావించి చేస్తే ప్రతి పనీ అద్భుతంగా పూర్తి అవుతుంది. ఆధ్యాత్మిక సాధనకు కుటుంబంలోని ప్రేమ ఒక సాధన. మోక్షానికి ఇది అడ్డు ఏ మాత్రం కాదు. కుటుంబాన్ని వద్దనుకుంటే జీవితంలో పై మెట్టుకు ఎదగడానికి పాస్ వూర్కులు లభించవు.
మీ భార్య ఎదుగుదలలో మీకెప్పుడూ ఈర్ష్య కలగలేదా?
చలపతిరావు: లేదు... అయినా ఎందుకు కలగాలి? స్వామి వీరిలో ఉండి అన్నీ చేయిస్తున్నారు. అందుకు నేను నా సహకారాన్ని అందిస్తున్నాను. మేం చేస్తున్న సేవాకార్యక్రమాలకు స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అవార్డ్ వచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది. విదేశాలకు వెళ్లినప్పుడు పర్యాటక ప్రాంతాలకన్నా ఎక్కువగా మేం వృద్ధాశ్రమాలను, అనాథాశ్రమాలను సందర్శిస్తుంటాం. వీరు పాడే సంకీర్తన, చేసే సేవ హృదయపూర్వకంగా ఉంటుంది. అందుకు నేను తోడవడం నాకెంతో ఆనందాన్నిస్తుంది.
వివాదాలు వచ్చినప్పుడు నొచ్చుకున్న సందర్భం...?
చలపతిరావు: వీరు బాధపడితే ఆటోమేటిగ్గా నా కర్చీఫ్ తడిసిపోతుంది. కన్నీళ్లు ఆగవు. ఎందుకంటే నేను, వీరు వేరుగా అనుకోవడం లేదు కాబట్టి. అలా జరిగిన సందర్భాలు చాలానే వచ్చాయి. కాని వాటినుంచి స్ఫూర్తి పొందాం. నేను ఇటీవల అవమానపడిన సందర్భాలూ ఉన్నాయి. ఎవరు ఏమైనా అనుకోనీ.. నొచ్చుకునే విషయూలు, ఇంటి సమస్యలు కూడా వీరి దగ్గరకు రానివ్వను. అలాంటి ఒత్తిడి వీరి మీద ఉండకూడదని నా ఉద్దేశ్యం. బయట ఏదైనా సరే నేనే చూసుకోవాలి. వీరు ఈలోకంలోకి వచ్చిన ఉద్దేశ్యం నెరవేరాలి. అదే నా ఆశయం.
మీ 14 ఏళ్ల దాంపత్యంలో ఉత్తమ అధ్యాయం చెప్పమంటే?
జ్యోతిర్మయి: ప్రతిదీ ఉత్తమమైనదే. మా జీవితంలో అంతా మంచే జరిగింది. మా మధ్య ఎన్నడూ వునస్పర్థలు లేవు. అసలు కొన్ని సందర్భాల్లో అయితే మాట్లాడుకోవడానికి కూడా వీలులేనన్ని సేవాకార్యక్రమాలలో మునిగిపోతాం. ఈ రోజుకు కూడా ఎదురుబొదురు కూర్చుని స్థిమితంగా మాట్లాడుకున్నది లేదు. ఏది లేకపోయినా ఇది ఎందుకు లేదు అని అనుకోవడం ఉండదు. ఏమీ లేకపోతే కారం వేసుకుని తింటాం. బతకడానికి తినాలనేది మా నియమం. పండగ వేళల్లో మాత్రం అత్తగారు పిల్లలు కోరినది తయారుచేసి ఇస్తారు. నేను చేసే వంట అంత బాగోదని తెలుసు. కాని ఇంట్లో మాత్రం అద్భుతం అని తినేస్తారు.
దాంపత్యం అంటే మీరెలాంటి అర్థ్ధం చెబుతారు?
చలపతిరావు: దేహాలు వేరుగా ఉండవచ్చు. కాని ఒకే ఆత్మగా ఉండాలి. పెళ్లి జరగక ముందు వేర్వేరు. జరిగాక ఇద్దరూ ఒక్కటే! భిన్నంగా చూడటం అనేది పోవాలి. ఇద్దరూ ఒకటే అనుకుంటే ఏ తేడా ఉండదు. పెద్దలు చెప్పింది ఆచరిస్తూంటే ఇద్దరికీ ఏ సమస్య రాదు.
జ్యోతిర్మయి: రాముడు చెప్పింది సీత, సీత చెప్పింది రాముడు వీరు ఇద్దరు చెప్పింది లక్ష్మణుడు.. అలా ఆచరిస్తూ వెళ్లిపోతే అది చక్కని కుటుంబం అవుతుంది. నా ముందు రాముడిలా వీరు ఎలా ఉన్నారో, లక్ష్మణుడిలా మా మరిది అలా ఉన్నారు. ఆ విధంగా మా ఈ కుటుంబం సాక్షాత్తూ ఆ శ్రీరాముని కుటుంబంలా భావిస్తాం.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
బద్దకాన్ని వీడాను..
వీరు (జ్యోతిర్మయి) ప్రతిరోజూ ఉల్లాసంగా నిద్రలేస్తారు. అన్ని పనులు పూర్తి చేసుకొని, పూజచేసి, సాధన మొదలుపెడతారు. వీరిని చూసే నా బద్దకాన్ని తగ్గించుకున్నాను. వీరికి సేవాకార్యక్రమాలంటే అమితమైన ఇష్టం. ఎంత సేవ చేసినా ఎన్నడూ ఆ మోములో అలసటే కనిపించదు. ఎందుకంటే స్వామి వీరిలో కొలువున్నారని నమ్ముతాను. వీరు ఈ ప్రపంచంలోకి వచ్చిన ఉద్దేశ్యమే వేరు. అందుకే సాధ్యమైనంతవరకు వీరి దరికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వను.
- చలపతిరావు
సహనం ఎక్కువ
వీరికి (చలపతిరావు) సహనం చాలా ఎక్కువ. ఎవరినీ పొరపాటున కూడా నొప్పించరు. పురుషాధిక్యం ఏ మూలనో ఉన్నా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. కాని ఇన్నేళ్లలో వీరు ఏనాడూ నా చేత చిన్న పని కూడా చేయించుకున్నది లేదు. పిల్లల ఆలనాపాలనా, ఇంటి బాధ్యతలు అన్నీ స్వయంగా చూసుకుంటారు. పనుల విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. మా నాన్నగారు క్రమశిక్షణ గల అల్లుడు అని మెచ్చుకుంటుంటారు.
- కొండవీటి జ్యోతిర్మయి