వైద్యుల మొద్దు నిద్రకు నిండుప్రాణం బలి
► ఆస్పత్రికి తాళం వేసుకుని గాఢ నిద్రలో వైద్య సిబ్బంది
► గుండెపోటుతో వచ్చిన వ్యక్తికి సకాలంలో చికిత్స లేక మృతి
► పొదటూరుపేటలో సంఘటన
పళ్లిపట్టు: వైద్యుల మొద్దు నిద్రకు ఓ నిండు ప్రాణం బలైన ఘటన పొదటూరుపేటలో చోటుచేసుకుంది. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట కుడియానవర్ వీధికి చెందిన జ్యోతీశ్వరన్ (69) రిటైర్డ్ బీడీవో కార్యాలయ సిబ్బంది.
శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రి ప్రధాన గేటు మూసివేసి సిబ్బంది లోపల నిద్రపోయారు. బాధితులు కేకలు వేసినా స్పందించలేదు. అనంతరం 25 నిమిషాల తరువాత మేల్కొన్న సిబ్బంది గుండెపోటుకు గురైన వ్యక్తికి చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే ప్రాణా లు విడిచాడు.
సిబ్బంది నిర్లక్ష్యం కాదు: ప్రభుత్వాసుపత్రి చీఫ్ డాక్టర్
చివరి నిమిషంలో రావడంతోనే ప్రాణాలు కాపాడలేక పోయాం. గుండెపోటు వచ్చిన వెంటనే ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి అక్కడ కాదని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు.
రాత్రి వేళల్లో తాగుబోతులు ఆస్పత్రిలోకి ప్రవేశించి గొడవలు చేస్తుండడంతో ఆస్పత్రి తలుపులు మూసి ఉంచుతాం. రోగులు వచ్చిన వెంటనే తెరిచి లోపలకి అనుమతించి చికిత్స చేస్తాం. అదే విధంగా గుండెపోటుతో వచ్చిన వ్యక్తిని అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స ప్రారంభించగానే మృతి చెందారు. ఇందులో మా నిర్లక్ష్యం లేదు.