K. Bhaskara Rao
-
గాలి దుమారం... పిడుగుల బీభత్సం
ఈదురు గాలుల బీభత్సానికి జిల్లా వాసులు వణికిపోయారు. జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పిడుగులు తోడయ్యాయి. దీంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఉదయం భీకరంగా సూర్యుడు నిప్పులు కురిపించగా, సాయంత్రం ఒక్కసారిగా గాలిదుమారం లేచింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ హఠాత్పరిణామంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో గురువారం సాయంత్రం పె ద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. గాలుల కారణంగా రోడ్డుపై దుమ్మూధూళి రేగి కళ్లలో పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు జల్లుల నుంచి భారీ వర్షం పడిం ది. చోట్ల చెట్లు నేలకూలగా సుమారు 100 విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. దీంతో పలు గ్రామాల్లో అంధకారం అలముకుంది. మామిడి పంటకు అపార నష్టం కలిగి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొంది. బొబ్బిలి మండలం రాముడువలసలో పొలంపనులకు వెళ్లిన బొంతలకోటి పోలమ్మ, మునగపాటి నారాయణమ్మలపై పిడుగు పడడంతో వారు మృత్యువాత పడ్డారు. ఎల్.కోట మండల కేంద్రంలో కె.భాస్కరరావు అనే వ్యక్తిపై గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందాడు. తెర్లాం మండలం నందబలగలో కండి వెంకటరమణకు చెందిన ఓ ఎద్దుపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది. నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, బొబ్బిలి, బాడంగి, తెర్లాం, గజపతినగరం, గుర్ల తదితర మండలాల్లో ఈదురుగాలులకు అనేక చెట్లు నేలకూలాయి. మొరకముడిదాం మండలంలో మామిడి పంట, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గుర్ల, బాడంగి, తెర్లాం, బొబ్బిలి, ఎల్.కోట మండలాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. బాడంగి మండలం వాడాడలో ఓ ఇంటిపై చెట్టు కూలిపోవడంతో గొట్టాపు తమ్మినాయుడు ఆయన భార్య నారాయణమ్మ, జగ్గునాయుడులు గాయపడ్డారు. దీంతో వారికి చికిత్స అందించారు. గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌కు అడ్డంగా చెట్టు కూలిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయనగరం నుంచి బొబ్బిలివైపు వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌ను సుమారు గంట సేపు నిలిపివేశారు. అనంతరం చెట్టును తొలగించాక రైళ్ల రాకపోకలను కొనసాగించారు. అదేవిధంగా నెల్లిమర్ల మండలం గరికిపేటలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలిపోయింది,. విజయనగరం నుంచి చీపురుపల్లి వెళ్లే రహదారిలోనూ, పార్వతీపురం వెళ్లే రహదారిలోనూ చాలా చెట్లు కూలిపోయాయి. పట్టణంలో కూలిన హోర్డింగ్‌లు, చెట్లు.. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, చెట్లు నేలకూలాయి. ట్యాంక్‌బండ్, ఇందిరా నగర్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలాయి. వాహనచోదకులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. -
కనువిందుగా కన్యాశుల్కం
=తొలి ప్రదర్శన మనోహరం =ఆకట్టుకున్న నటీనటులు =మూడు గంటలపాటు కట్టిపడేసిన నాటకం చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : మహాకవి గురజాడ కలం నుంచి జాలువారి, శతాబ్దం తర్వాత కూడా సజీవంగా ఉన్న అజరామర నాటకం కన్యాశుల్కం ప్రేక్షకులను కట్టిపడేసింది. చోడవరం మండలంలో తొలిసారిగా ప్రదర్శితమైన సంక్షిప్త నాటకం వీక్షకులను రసవాహినిలో ఓలలాడించింది. కడుపుబ్బా నవ్వించింది. రంగస్థల నటులకు సవాలనదగ్గ ఈ నాటకంలో రాణించడంతో స్థానిక కళాకారుల సంతోషానికి అవధి లేకుండా పోయింది. గోవాడకు చెందిన లిఖిత సాయి క్రియేషన్స్ సంస్థ మొట్ట మొదటిసారిగా కన్యాశుల్కం నాటకాన్ని శనివారం రాత్రి ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో పంచముఖాంజనేయ, వేణుగోపాల స్వామి ఆలయాల ద్వితీయ వార్షికోత్సవం సందర్బంగా ఈ ప్రదర్శన సాగింది. గోవాడకు చెందిన భాగవతులు ఉదయ్ కుమార్ దర్శకత్వంలో సాగిన ఈ నాటక ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వణికించే చలిలో సైతం శనివారం రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ నాటకాన్ని తిలకించడం విశేషం. మన జిల్లాకే చెందిన మహాకవి గురజాడ రచించిన కన్యా శుల్కం నాటకం ఆధారంగా మూడు గంటల నిడివిలో ఈ ప్రదర్శన సాగింది. నాటకానికి ఆయువుపట్టయిన గిరీశం పాత్రలో ఉదయ్ కుమార్ ఆకట్టుకున్నారు. అతని శిష్యుడు వెంకటేశంగా బాల నటుడు వినయ్ రసవత్తరంగా నటించి రంజింపజేశాడు. సహజసిద్ధమైన రంగస్థలాంకరణ నాటకానికి మరింత కళ తెచ్చింది. ఏళ్లు గడిచినా గురజాడ కన్యాశుల్కానికి గల ఆదరణ తరగలేదని శనివారం మరోసారి రుజువైంది. ప్రేక్షకాదరణతో నాటక ప్రదర్శనపై నమ్మకం పెరిగిందని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతామని లిఖిత సాయి క్రియేషన్స్ ప్రతినిధి జయంతి సతీష్ తెలిపారు. నాటకంలోని కళాకారులను కందర్ప గౌరీశంకర్ దంపతులు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు కె. భాస్కరరావు, సమైక్యాంధ్ర జేఏసీ గోవాడ కన్వీనర్ ఎం.ఏ దేముడు, తదితరులు జ్ఞాపికలతో ప్రత్యేకంగా అభినందించారు. చాలా బాగుంది. కన్యాశుల్కం నాటక ప్రదర్శన చాలా బాగుంది. మొదటి ప్రయత్నంలోనే ఇంతలా విజయవంతం అవుతుందని అనుకోలేదు. ఈ నాటకంలో సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉండడం సంతోషం. వారికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తాం. - కె.భాస్కరరావు, గోవాడ సుగర్స్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు. విజయవంతమయింది ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా కేవలం నాటికల పోటీలనే ఏర్పాటు చేశాం. అయితే మొదటి ప్రదర్శనగా చేసిన కన్యాశుల్కం నాటకంతో వార్షికోత్సవం విజయవంతం అయినట్లయ్యింది. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులే దీనికి నిదర్శనం. - వి. రామకృష్ణ, ఆలయ ధర్మకర్త. వెంకన్నపాలెం.