రాష్ట్రాన్ని చీల్చడం అన్యాయం
భీమవరం, న్యూస్‌లైన్ : స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని చీల్చడం అన్యాయమని వైఎస్సార్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళాపతి అన్నారు. సమైక్యాంధ్రే లక్ష్యంగా ఈనెల 18న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ సీమాంధ్ర సద్భావన యాత్ర శనివారం భీమవరం చేరుకుంది. స్థానిక ప్రకాశం చౌక్‌లో సద్భావన యాత్రకు వైసీపీ శ్రేణులు, సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓబుళాపతి మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చేపట్టిన సద్భావన యాత్రకు విశేష ఆదరణ లబిస్తోందన్నారు. అయిదున్నర దశాబ్ధాలుగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని స్వార్థప్రయోజనాల కోసం విభజించడానికి ప్రయత్నించడం హేయమైన చర్య అని అన్నారు.
1953లో పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధానిగా ఉన్న మద్రాసు నగరాన్ని కోల్పోయామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూడు ప్రాంతాల సమష్టి కృషితో రాజధాని హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ద్వారా రాష్ట్రానికి సంవత్సరానికి 90 వేల కోట్లు ఆదాయం వస్తోందని తెలిపారు. అటువంటి హైదరాబాద్‌ను తెలంగాణ ప్రాంతానికి పరిమితం చేస్తే సీమాంధ్ర ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మునిసిపల్ చైర్మన్ గ్రంధి వెంక టేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ముందుండి ఉద్యమాన్ని నడిపించాలన్నారు. వైసీపీ నాయకులు, చర్చి ఆఫ్ క్రైస్ట్ అధినేత మేడిది జాన్సన్ మాట్లాడుతూ 53 రోజులుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు టీవీ రమణారెడ్డి, ఎం.రియాజ్ హుస్సేన్, రఘునాధ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వైసీపీ పట్టణ కన్వీనర్ కోడె యుగంధర్, జిల్లా స్టీరింగ్ క మిటీ సభ్యులు వేగేశ్న రామకృష్ణంరాజు, రేవూరి గోగురాజు, బోడసింగ్ మల్లేశ్వరరావు, కొప్పర్తి వీరరాఘవులు పాల్గొన్నారు.