'టీడీపీ, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారు'
- సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి జిల్లా): విభజన చట్టంలోని అంశాల అమలులో ఘోరంగా విఫలమైన కేంద్రంలోని బీజేపీ, రాష్టంలోని టీడీపీ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వారం రోజులుగా సీపీఐ ఆధ్వర్యాన జరుగుతున్న జనసేవాదళ్ శిక్షణ శిబిరానికి హాజరైన ఆయన స్థానిక గడియారం స్తంభం సెంటర్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. హామీలు ఇచ్చి విస్మరించడంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారని విమర్శించారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, సామాన్యులు ఇలా ప్రతి వర్గం ప్రజలు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలవల్ల దేశ చరిత్రలో ఎప్పుడూ పడనంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టుకుని సాధించుకున్న చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సవరిస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రసంగించిన ప్రతి వక్తా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై సామాన్యుడు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. సీపీఐ సీనియర్ నాయకులు కె.సత్తిబాబు, దేవ రాజేంద్రప్రసాద్, చెల్లబోయిన కేశవశెట్టి, డాక్టర్ చలసాని స్టాలిన్, ఎల్.లెనిన్‌బాబు తదితరులు ప్రసంగించిన వారిలో ఉన్నారు. జనసేవాదళ్ శిక్షణ శిబిరానికి చెందిన యువకులు ఎర్రని దుస్తులు ధరించి, అరుణ పతాకాలు చేబూని.. పట్టణ వీధుల్లో గురువారం సాయంత్రం నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.