మురికివాడలకు మంచిరోజులు
సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా 2000 జనవరి ఒకటో తేదీ వరకు ఏర్పడిన మురికివాడలకు రక్షణ కల్పించే బిల్లుకు గవర్నర్ కె.శంకర్నారాయణన్ ఆమోదం తెలిపారు. ఫలితంగా మురికివాడల పునరాభివృద్ధి చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ముంబైలోని దాదాపు మూడు లక్షల గుడిసెలకు రక్షణ లభించనుంది. అంతేగాక మురికివాడలవాసులకు ఉచితంగా ఇళ్లు పొందేందుకు అవకాశం లభించనుంది. మురికివాడల రక్షణకు చట్టం తెస్తామంటూ కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం 2004 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరింది. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ చట్టం ఉపకరిస్తుందని అధికారపక్షం భావిస్తోంది. చట్టం అమ లు వల్ల ముంబై, ఠాణే, పుణే, నాగపూర్, ఔరంగాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో వెలసిన మురికివాడలను క్రమబద్ధీకరించడంతోపాటు అక్కడ సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుంది.
ముం బైలో పెరిగిన మురికివాడలకు అడ్డుకట్ట వేసేందుకు 2001లో డీఎఫ్ కూటమి ప్రభుత్వం ఈ బిల్లును తయారు చేసింది. 1995 జనవరి ఒకటి తేది వరకు వెలిసిన గుడిసెలకు ఇది రక్షణ కల్పిస్తుందని అప్పుడు పేర్కొ న్నా, దీనిని 2000 వరకు పొడగించారు. అయితే 2004లో శాసనసభ ఎన్నికలు సమీపించడంతో మురికివాడల పేదల బిల్లు అమలు కోసం ఆందోళనలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రధాన ఓటు బ్యాంకు మురికివాడలే కావడంతో, వీరిని సంతృప్తి పరిచేందుకు బిల్లు అమలుపై దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో విడుదల చేసిన తమ మేనిఫెస్టోలో గుడిసెలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చా రు. ఫలితంగా అప్పుడు కాంగ్రెస్ లబ్ధిపొందిన విష యం తెలిసిందే. ముంబైలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య పెరిగింది. మిత్రపక్షమైన ఎన్సీపీతో కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చింది. తరువాత మాట మార్చి ఈ బిల్లును పక్కన బెట్టారు. అయినా 2009 లో శాసనసభ ఎన్నికల్లో మళ్లీ ఇదే అంశం తెరపైకి వచ్చింది. పేదల ఓట్లను తమవైపునకు మలచుకోవడంలో సఫలీకృతమై మళ్లీ అధికారంలో కి వచ్చారు.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందు అంటే ఫిబ్రవరిలో నిర్వహించిన ఆర్థిక బడ్జెట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలిపారు. 2000 జనవరి ఒకటో తేదీలోపు వెలసిన గుడిసెలకు మహారాష్ట్ర మురికివాడల అభివృద్ధి చట్టం ప్రకారం రక్షణ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తదనంతరం ఈ బిల్లును గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపిం చారు. అప్పటికే లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇది పెండింగులోనే ఉండిపోయింది. లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు డీఎఫ్ కూట మిని ఘోరంగా ఓడించారు. గవర్నర్ ఇటీవల ఈ బిల్లుకు పచ్చజెండా ఊపారు. శాసనసభ ఎన్నికల్లో తమకు మురికివాడల రక్షణ చట్టం మేలు చేస్తుందని డీఎఫ్ భావిస్తోంది.