K. tarakarama Rao
-
పెట్టుబడులకు సానుకూల వాతావరణం
కల్పించాలని వివిధ శాఖల కార్యదర్శులకు కేటీఆర్ సూచన సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక పెట్టుబడులకు అనువుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు.. సానుకూల వాతావరణం కల్పించే లక్ష్యంగా అధికారులు పని చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సూచించారు. రాష్ట్రంలో సులభ వాణిజ్యానికి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వీలుగా వివిధ ప్రభుత్వ విభాగాల వారీగా చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖల కార్యదర్శులతో శనివారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం గల రాష్ట్రాల్లో తెలంగాణకు 13వ స్థానం దక్కడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఏడాది మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రణాళిక బద ్ధంగా కృషి చేయాలన్నారు. మెరుగైన ర్యాంకు సాధనకు ఉద్దేశించిన ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వాలని చెప్పారు. ఈ ఏడాది జూన్‌లోగా జీహెచ్ఎంసీ పరిధిలో రిమోట్ మానిటరింగ్ వ్యవస్థ ‘స్కాడా’ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఇంధనశాఖ అధికారులు తెలిపారు. మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉన్న మాస్టర్ ప్లాన్లను ఆ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. తద్వారా సులభ వాణిజ్యంలో రాష్ట్రానికి మెరుగైన ర్యాంకు సాధించడం సాధ్యమవుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పర్యవేక్షణకు ప్రతీ 15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని మంత్రి నిర్ణయించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌తో పాటు ఇంధన, మున్సిపల్, న్యాయ, అటవీ శాఖల కార్యదర్శులు, సీసీఎల్ఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు పాల్గొన్నారు. -
పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ కు బాధ్యతలు
పరిశ్రమల శాఖ అనుబంధ విభాగాల పనితీరుపై ఆరా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా కె.తారకరామారావు మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు... మంత్రిత్వ శాఖల మార్పిడిలో భాగంగా తాజా శాఖ కేటాయించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌ను పరిశ్రమలు, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు కలసి అభినందించారు. పరిశ్రమల శాఖ పనితీరుపై మంత్రి ఆరా తీయడంతో పాటు ఆయా విభాగాల్లో సమస్యలు తెలుసుకున్నారు. చేనేత, వస్త్ర పరిశ్రమల విభాగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. దేశంలో వివిధ విభాగాల్లో నెలకొన్న అత్యున్నత విధానాలను స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆ దిశగా అధికారులు అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మైనింగ్ అక్రమాలను అరికట్టడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు, ప్రజలకు కూడా మేలు జరుగుతుందన్నారు. తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులను ఆదుకొనే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. గురువారం పరిశ్రమలతో పాటు, చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగంపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తానని కేటీఆర్ చెప్పారు. మంత్రిని కలసిన వారిలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం డైరక్టర్ ప్రీతీమీనా, ఆప్కో ఎండీ శైలజారామయ్యర్, టీఎస్ఎండీసీ డైరక్టర్ ఇలంబర్తి, టీఎస్ఐఐసీ ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి ఉన్నారు. -
నేడు బిట్స్‌కు కేటీఆర్
శామీర్‌పేట్ : మండలంలోని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి శనివారం ఉదయం భూమిపూజ చేస్తున్నట్టు బిట్స్ డెరైక్టర్ వీఎస్ రావు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.