పెట్టుబడులకు సానుకూల వాతావరణం
కల్పించాలని వివిధ శాఖల కార్యదర్శులకు కేటీఆర్ సూచన
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక పెట్టుబడులకు అనువుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు.. సానుకూల వాతావరణం కల్పించే లక్ష్యంగా అధికారులు పని చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సూచించారు. రాష్ట్రంలో సులభ వాణిజ్యానికి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వీలుగా వివిధ ప్రభుత్వ విభాగాల వారీగా చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖల కార్యదర్శులతో శనివారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం గల రాష్ట్రాల్లో తెలంగాణకు 13వ స్థానం దక్కడాన్ని ప్రస్తావిస్తూ..
ఈ ఏడాది మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రణాళిక బద ్ధంగా కృషి చేయాలన్నారు. మెరుగైన ర్యాంకు సాధనకు ఉద్దేశించిన ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వాలని చెప్పారు. ఈ ఏడాది జూన్‌లోగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రిమోట్ మానిటరింగ్ వ్యవస్థ ‘స్కాడా’ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఇంధనశాఖ అధికారులు తెలిపారు. మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉన్న మాస్టర్ ప్లాన్లను ఆ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. తద్వారా సులభ వాణిజ్యంలో రాష్ట్రానికి మెరుగైన ర్యాంకు సాధించడం సాధ్యమవుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పర్యవేక్షణకు ప్రతీ 15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని మంత్రి నిర్ణయించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌తో పాటు ఇంధన, మున్సిపల్, న్యాయ, అటవీ శాఖల కార్యదర్శులు, సీసీఎల్‌ఏ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు పాల్గొన్నారు.