మరణంలోనూ వీడని బంధం
కానుకొల్లు (మండవల్లి):
జీవితమంతా కలిసే ఉంటామని, కష్టసుఖాలు సమానంగా పంచుకుంటామని బాసలు చేశారు. చివరకు ఇద్దరూ కలిసే ఈ లోకాన్ని వీడిపోయారు. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కానుకొల్లు గ్రామంలో శనివారం జరిగింది. భార్యాభర్తలు ఇరువురూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కానుకొల్లు గ్రామానికి చెందిన సింగిడి శ్రీనివాసరావు(44), భార్య ఎల్లమ్మ(40) అప్పుల బాధ తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగారు. ఉదయం ఎంతకీ నిద్రలేకపోవడంతో ఇరుగుపొరుగు అనుమానంతో పరిశీలించగా అప్పటికే మరణించారు.
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు
శ్రీనివాసరావు, ఎల్లమ్మల మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరికి లక్ష్మి, జ్యోతి అనే పెళ్లయిన ఇద్దరు కుమార్తెలు, ఇంటర్ వరకు చదివిన కుమారుడు ఉత్తమకుమార్ ఉన్నారు. విషాదంతో షాక్కు గురయ్యారు. తల్లిదండ్రులు తిరిగిరారని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్ఐ ఎ.మణికుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఏ మందు తాగారో తెలియడం లేదని, ఆధారాలు లభ్యం కాలేదని చెప్పారు. పీఎం నిమిత్తం మృతదేహాలను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.