బహిరంగంగా విద్యార్థి ఉరితీత
ఘాజి: తమ నిఘా అధికారిని హత్యచేశాడని ఆరోపిస్తూ తాలిబాన్ మిలిటెంట్లు అఫ్గానిస్తాన్‌లో ఓ విద్యార్థిని బహిరంగంగా ఉరితీశారు. కాబూల్ పాలిటెక్నిక్ వర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఫైజుల్ రెహ్మాన్ అనే విద్యార్థి గురువారం కారులో ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో మిలిటెంట్లు అతన్ని అదుపులోకి తీసుకుని శుక్రవారం బహిరంగంగా ఉరితీశారని స్థానిక గవర్నర్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఈ ఘాతుకాన్ని అఫ్గానిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ నిర్ధరించింది. దుశ్చర్యకు పాల్పడిన వారిని పట్టుకుని, శిక్షించేందుకు విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది. 2001 నుంచి తాలిబాన్ మిలిటెంట్లు ఎంతో మందికి బహిరంగ శిక్షలు అమలు చేశారు. అఫ్గానిస్తాన్, విదేశాలకు సమాచారం అందజేసిన వారిని, పెళ్లి చేసుకోకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని బహిరంగంగా రాళ్లతో, కొరడతాలతో కొట్టడం వంటి శిక్షలు విధించారు.