నిధుల స్వాహా పర్వం పయనమెటో?
కడప అర్బన్ :
కడప ఆర్ట్స్ కళాశాలలో నిధుల స్వాహా పర్వం వెనుక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల స్కాలర్షిప్పులు, ఇతర ఫీజుల నిధులు దాదాపు రూ. 60 లక్షలకు పైగా నగరంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ నిధులపై కళాశాలలోని సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి కన్నేశారు. తన చేతికి మట్టి అంటకుండా మారుతీనగర్‌లో మ్యారేజ్‌బ్యూరో నిర్వహిస్తున్న కవిత అనే మహిళను సహాయపడాలని కోరారు. ఆమెకు ప్రముఖ వ్యక్తులతో పరిచయం ఉండడంతో వారిలో కొందరిని నిధుల స్వాహాకు పాత్రధారులుగా ఉపయోగించుకుంది. రఘురామిరెడ్డి ద్వారా అతని స్నేహితుడు ఎంఎం మహమ్మద్ అలియాస్ చిన్నా ద్వారా రూ. 4,600 చెక్కును ట్రైలర్‌గా ఎస్బీఐ ఖాతా ద్వారా డ్రా చేయించారు. తన పథకం ఫలించడంతో స్వాహా పర్వానికి పూనుకున్నాడు. రఘురామిరెడ్డి విద్యార్థుల స్కాలర్‌షిప్పుల చెక్‌బుక్‌లోని నాలుగు చెక్కులను మార్చుకునేందుకు ప్రయత్నించి సఫలీకృతులయ్యాడు. మారుతీనగర్‌కు చెందిన షారోన్ కృపాకర్ ద్వారా రూ. 4.30 లక్షలను సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెక్కును పంపించి ఖాతాలో జమ అయ్యేలా చూశారు. ఈ క్రమంలో సదరు బ్యాంకు మేనేజర్ అథారిటీ లెటర్ తీసుకు రావాలని కృపాకర్‌ను కోరారు. తమ గుట్టు రట్టవుతుందని రఘురామిరెడ్డి, కవితతో కలసి ప్రిన్సిపాల్ వెంకటలక్షుమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి అథారిటీ లెటర్‌ను పంపించారు. అథారిటీ లెటర్‌ను బ్యాంకు మేనేజర్ ప్రిన్సిపాల్ వెంకట లక్షుమ్మ వద్దకు పంపారు. ఆమె తన సంతకం ఫోర్జరీ అయిందని గమనించి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రంగనాయకులు కేసు నమోదు చేశారు.