హైవేపై ‘నిఘా’నేత్రాలు!
రాజంపేట : జిల్లాలోని కడప-చెన్నై ప్రధానరహదారిలో నిఘానేత్రాలు (సీసీకెమెరాలు) ఏర్పాటయ్యాయి. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రాజంపేట ఫారెస్టు డివిజన్లోని రామాపురం వద్ద 2013లో చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. ఈ చెక్‌పోస్టు వద్ద జిల్లాలోనే ప్రప్రథంగా మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో కూడా ఇటువంటి తరహాలో నిఘానేత్రాలు ఏర్పాటుచేసినట్లు అటవీ వర్గాలు చెబుతున్నాయి. ఎర్రచందనం అక్రమరవాణా విషయంలో ఇటీవల స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. వాహనాల్లో తరలిస్తున్న క్రమంలో చెక్‌పోస్టులను కొట్టేసుకుని వెళ్లిపోతున్నారు. చెక్‌పోస్టు సిబ్బందిపై దాడికి కూడా దిగుతున్న సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. సీసీకెమెరాలకు అనుబంధంగా ప్రత్యేకంగా ఒక గదిని కూడా నిర్మించారు. ఈ గదిలో బ్రాడ్‌బ్యాండ్ , కంప్యూటర్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. రామాపురం చెక్‌పోస్టులో అత్యధిక సంఖ్యలో ఇప్పటికే 90కిపైగా వాహనాలతోపాటు లక్షలాది రూపాయిలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.
పైస్థాయి నుంచి పర్యవేక్షణ..
చెక్పోస్టులపై అటవీశాఖ పరంగా పైస్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు పర్యవేక్షించేందుకు దశలవారీగా నిఘానేత్రాలను ఏర్పాటుచేస్తున్నారు. రామాపురంలో మూడు సీసీ కెమెరాలను చెక్‌పోస్టు రోడ్డు, గేటు కవర్ అయ్యే రీతిలో ఏర్పాటుచేసుకున్నారు. ఈ కెమెరాల ద్వారా స్థానికంగా ఉండే డీఎఫ్ఓ స్థాయి అధికారులు చెక్‌పోస్టు సిబ్బంది పనితీరును పరిశీలిస్తారు. స్మగ్లర్లతో కుమ్మక్కై ఎర్రచందనం వాహనాలను వదిలివేయడం జరుగుతుందో లేదో అని కూడా సీసీకెమెరాల ద్వారా పసిగట్టేందుకు వీలుంటుంది. వివిధ రకాలుగా వాహనాల్లో ఎర్రబంగారం చెక్‌పోస్టులను దాటుకుని వెళుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. చెక్‌పోస్టులను దాటుకుని అక్రమంగా వెళ్లే వారి వాహనాలను గుర్తించి తర్వాతి ఫారెస్టు స్టేషన్‌కు సమాచారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వాహనం పట్టుబడితే ..మరికొన్ని వాహనాలు చెక్‌పోస్టు దాటుకుని వెళ్లిపోతున్నాయని ఆరోపణలు వెలువడుతున్న క్రమంలో సీసీకెమెరాలను తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.
పోలీసుశాఖకు చేదోడుగా..
నేరాలు..ఘోరాలు చోటుచేసుకుంటున్న తరుణంలో చెక్‌పోస్టులో ఉన్న నిఘానేత్రాలు పోలీసుశాఖకు చేదోడువాదోడుగా నిలవనున్నాయి. రోడ్డు ప్రమాదాలు చేసి తప్పించుకునే వెళ్లే వారిని ఇట్టే పసిగట్టేందుకు అవకాశాలు ఉంటాయి. నేరగాళ్లు సులభంగా వాహనాల్లో తప్పించుకునేందుకు వీలులేకుండా సీసీకెమెరాల ద్వారా పట్టుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.. అటవీ సిబ్బందితోపాటు పోలీసుశాఖ పరంగా కూడా సిబ్బందిని రామాపురం చెక్‌పోస్టు వద్ద నియమించారు.