వైఎస్సార్ సీపీ నేతృత్వంలో.. సకలం బంద్
సాక్షి, కడప : తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినేట్ ఆమోదించినందుకు నిరసనగా జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన 72 గంటల పిలుపు మేరకు తొలిరోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బంద్‌ను పాటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు ఉదయం 6 గంటల నుంచే బంద్‌ను పర్యవేక్షించారు.
రోడ్లపై టైర్లు, మొద్దులు కాలుస్తూ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించడంతో దుకాణాలు, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. జన జీవనం పూర్తిగా స్తంభించింది. పట్టణాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ర్యాలీలు, మానవహారాలతోపాటు రిలే దీక్షలతో వైఎస్సార్సీపీ శ్రేణులు తమ నిరసనలు తెలియజేశాయి.
కడపలో పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎస్బి అంజాద్బాష బంద్‌ను పర్యవేక్షించారు. నగర వీధుల్లో కలియతిరుగుతూ వాహనాలను అడ్డుకున్నారు. ప్రజలుకూడా స్వచ్ఛందంగా తరలివచ్చి బంద్‌కు సహకారం అందించారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి నేతృత్వంలో 20 మంది మహిళలు దీక్షలు చేపట్టారు.
జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. షిండే, దిగ్విజయ్‌సింగ్, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బంద్‌ను పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు.
బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో ‘సేవ్ఆంధ్రప్రదేశ్’ ఆకారంలో మానవహారం నిర్మించి నిరసన వ్యక్తం చేశారు. బి.కోడూరు మండలంలో వైఎస్సార్సీపీ నేతలు చౌదరి రామకృష్ణారెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో పెద్దుళ్లపల్లె, మాధవరాయునిపల్లె గ్రామాలకు చెందిన 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బంద్‌ను పర్యవేక్షించారు. మాజీ సర్పంచ్ భూమన్ శివశంకర్‌రెడ్డి నేతృత్వంలో 80 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో 20 మంది మూడవ రోజు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో కృష్ణచైతన్యరెడ్డి, వంశీధర్‌రెడ్డి, దేవిప్రసాద్‌రెడ్డి పట్టణంలో కలియతిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు.
కమలాపురంలో ఉత్తమారెడ్డి నేతృత్వంలో గ్రామ చావిడి నుంచి క్రాస్‌రోడ్డు వరకు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం బంద్‌ను పర్యవేక్షించారు. యల్లారెడ్డిపల్లె సర్పంచ్ రవిశంకర్‌రెడ్డి, కొండాయపల్లె మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో 12, 13, 14 వార్డులకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు దశరథరామిరెడ్డి, సాబ్జాన్ ఆధ్వర్యంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ దేవనాథరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, జాఫర్ తదితర నేతల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు బంద్‌ను పర్యవేక్షించాయి.
మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంద్‌ను పర్యవేక్షించారు.
రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు రెండు గంటలపాటు రైల్‌రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. గూడ్స్‌తోపాటు అర్కొణం, ముంబయి-చెన్నై, కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
పులివెందులలో నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ బస్టాండు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బోనాల, సిద్దారెడ్డిపల్లె గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.