కడప రీజియన్‌కు 250 కొత్త బస్సులు
నంద్యాల: కడప రీజియన్ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల డిపోలకు 250 కొత్త బస్సులను కేటాయించామని కడప రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంచి సేవలను అందించిన కార్మికులకు శనివారం ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా 119 ఎక్స్‌ప్రెస్, 34డీలక్స్, ఏడు సెమీలగ్జరీ బస్సులను ఇచ్చామని, కర్నూలు జిల్లాకు 97 బస్సులను అందజేశామని చెప్పారు. గత ఏడాది నాటికి కర్నూలు జిల్లాలో ఆర్టీసీ 23.8లక్షల నష్టాల్లో ఉండగా రూ.12.17లక్షలకు తగ్గించామని చెప్పారు. నంద్యాల డిపోలో గత ఏడాది రూ.1.40కోట్ల నష్టం రాగా కార్మికులు శ్రమించి నష్టాన్ని రూ.13లక్షలకు తగ్గించడం అభినందనీయమన్నారు. రీజియన్‌లో రూ.5కోట్ల నష్టం వచ్చిందని, దీన్ని క్రమేపీ తగ్గిస్తూ వస్తున్నామని చెప్పారు. ప్రయాణీకుల మన్ననలు పొందడానికి సిబ్బంది, కార్మికులు పని చేయాలన్నారు. ఆదాయం వచ్చే రూట్లలోనే బస్సులను తిప్పాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్, అసిస్టెంట్ డీఎం దీప్తిసుజన పాల్గొన్నారు.