భోరున ఏడ్చిన కడప టీడీపీ అభ్యర్థి
సాక్షి, కడప : కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమీర్ బాబు భోరున విలపించారు. పార్టీ కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తన దగ్గరున్నదంతా ఊడ్చిపెట్టానని, ఒక్కపైసా కూడా ఎవరూ సాయం చేసింది లేదని ఆయన కార్యకర్తల సాక్షిగా కంటతడిపెట్టారు. ఇకనైనా కార్యకర్తలను పట్టించుకోవాలని అమీర్ బాబు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అమీర్ బాబు అధిష్టాన పెద్దల చిన్నచూపుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన ...మరోవైపు భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేకపోక భోరుమన్నారు.
పార్టీలో దోచుకున్నవాళ్లు దోచుకుంటున్నారని, జెండా మోసేవాళ్లు ఇంకా మోస్తూనే ఉన్నారని అమీర్‌బాబు అన్నారు. కార్యకర్తల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై తిగురుబావుటా ఎగురవేసిన ఆయన మీ అనుచరులకే తప్ప..కడపలో జెండా మోసిన నిజాయతీ గల కార్యకర్తకు మీరేమైనా చేశారా అంటూ అమీర్‌బాబు మండిపడ్డారు. కార్యకర్తలను పట్టించుకోని నాయకులు ఎందుకని ప్రశ్నించిన అమీర్‌బాబు...ఇన్నాళ్లుగా అధిష్టానం తననూ ఏమీ పట్టించుకోలేదంటూ భోరున ఏడ్చేశారు. మరోవైపు ఎంపీ ఆదినారాయణరెడ్డిపైనా అమీర్ బాబు ఇంతెత్తున లేచారు. మాకేం చేశారని మీకు మద్దతు ఇవ్వాలంటూ మంత్రి ఆదిని సూటిగా ప్రశ్నించారు.