అభివృద్ధా..? అదెక్కడా..: వీర రాఘవరెడ్డి
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతోంది. జిల్లాలో అభివృద్ధి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. కేవలం ఓట్లు, సీట్లు ఆధారంగా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నారు తప్ప ఇక్కడ చెప్పుకునేంత అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. చివరకు అంతా అభివృద్ధి జరిగిన హైదరాబాదును వదులుకొని విజయవాడకు వచ్చినా.. చంద్రబాబు తెలిసి చేస్తున్నాడో...తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ. మళ్లీ అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో చేస్తున్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణను బాబు పూర్తిగా విస్మరించారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోకుండా చివరి క్షణంలో బయటికి వచ్చి వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు టెంకాయ శంకుస్థాపన చేశారు. పట్టిసీమ నుంచి అధికారికంగా ఒక్క టీఎంసీ నీటిని కూడా నికర జలాలుగా తీసుకొచ్చిన చరిత్ర కనిపించడం లేదు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా.. చివరకు బెంచ్‌ను కూడా ఏర్పాటు చేయకపోవడం విచారకరం.
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో దాదాపు 80 శాతానికి పైగా ప్రాజెక్టుల పనులు పూర్తయినా కేవలం 20 శాతం పనులు చేయడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు.. అని పేర్కొన్నారు కడప బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాదుల సీమ జేఏసీ మాజీ కన్వీనర్ వీరరాఘవరెడ్డి. గత ఐదేళ్ల చంద్రబాబు పాలన తీరుపై న ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు.
సాక్షి : రాయలసీమకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు వైఎస్సార్, చంద్రబాబు పరిపాలించారు. వీరి పరిపాలనలో మీరు చూసిన లోటుపాట్లు, అభివృద్ధి గురించి ఏమంటారు?
వీర రాఘవరెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనలోగానీ, అభివృద్ధిలోగానీ వైఎస్సార్‌తో చంద్రబాబును పోలిస్తే నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. వైఎస్సార్ అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తూ వచ్చారు. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమం అందుతూ వచ్చింది. అంతెందుకు గాలేరు–నగరి, హంద్రీ–నీవా లాంటి పెద్ద ప్రాజెక్టులకు ఎప్పుడో పునాది రాయి వేస్తూ వైఎస్సార్ హయాంలో 80 శాతానికి పైగా పూర్తి చేసినా, ఆయన మరణం తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విస్మరించాయి. గండికోట టన్నెల్ చరిత్రలోనే ఓ అద్భుతం.
సాక్షి : ‘సీమ’లోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో వైఎస్సార్ జిల్లా ఒకటి. ఈ ఐదేళ్లలో టీడీపీ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారు?
వీర రాఘవరెడ్డి : వైఎస్సార్ జిల్లాలో అభివృద్ధే లేదు. అంతా ఓట్లు, సీట్లు ఆధారంగానే జరుగుతోంది. సీఎం బహిరంగంగానే ఎన్నోసార్లు సభలు, సమావేశాల్లో మీరు ఓట్లు వేయకున్నా అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రానికి అంతటికీ సీఎం అయినప్పుడు వైఎస్సార్ జిల్లాకు కూడా ఆయన ముఖ్యమంత్రే. కానీ అలాంటివన్నీ మరిచిపోయి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు లేకుండా ముందుకు వెళ్లారు. ఐదేళ్లు టీడీపీ హయాంలో జిల్లాకు ఒరిగింది శూన్యమే.
సాక్షి : ఎన్నికలకు ముందు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడంపై మీరెమంటారు?
వీర రాఘవరెడ్డి : కడప ఉక్కు–రాయలసీమ హక్కు అని 2014 నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. వామపక్షాలతోపాటు ఆర్సీపీ, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాలు, ఉక్కు సాధన సమితి ఇలా అందరూ వచ్చి ఉద్యమంలో పాల్గొంటూ కేంద్రంపై పోరాటం చేశారు. ఒక్క అధికార పార్టీ నాయకులు మాత్రం ఆందోళనలకు రాలేదు. పైగా నాలుగున్నరేళ్ల తర్వాత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉద్యమం పేరుతో టీడీపీ ముందుకు వచ్చింది. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఒక ప్రణాళిక లేకుండా ముందుకు వెళుతూ అందరినీ విస్మరించడంతోనే సమస్య ఏర్పడింది. చివరగా ఏమీ చేయలేక...కేంద్రంపై పోరాడలేక ప్రజల్లో సానుభూతి కోసం...వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఉక్కుకు టెంకాయ శంకుస్థాపన చేశారు. అంతేతప్ప అది అయ్యేది కాదు...పోయేది కాదు...ఏదైనా ప్రభుత్వరంగ సంస్థ ఉంటేనే ఉక్కు ద్వారా పలువురికి ప్రయోజనం.
సాక్షి : అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదు. హైకోర్టు సీమలో ఏర్పాటు చేయాలని ఉద్యమించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కదా?
వీర రాఘవరెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరూ సీఎంలు రాజధాని హైదరాబాదును బాగా అభివృద్ధి చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రధాన నగరాలు లేక రాజధానికి కూడా ఇబ్బందులు పడిన పరిస్థితులు చూశాం. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా చంద్రబాబులో మార్పు కనిపించడం లేదు. తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదుగానీ మళ్లీ రాజధాని ప్రాంతంలోనే అభివృద్ధి చేస్తున్నారు. ఒకప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పినా ప్రస్తుతం పట్టించుకోలేదు. శ్రీబాగ్ ఒడంబడికతోపాటు వికేంద్రీకరణలో భాగంగా సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున న్యాయవాదులంతా ఉద్యమించినా మళ్లీ రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. చివరికి హైకోర్టు బెంచ్ విషయంలో కూడా ప్రకటనలు చేస్తున్నారేగానీ స్పష్టత లేదు.
సాక్షి : న్యాయవాదుల సంక్షేమం విషయంలోప్రభుత్వ తీరు ఎలా ఉంది?
వీర రాఘవరెడ్డి : తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో అందరితోపాటు న్యాయవాదుల సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబుకు హామీలు నెరవేర్చాలన్న ఆలోచన లేదు. జూనియర్ న్యాయవాదులకు స్టయిఫండ్ ఇస్తామన్నారు.అదీ లేదు. ఇల్లు మంజూరు అన్నారు...అతీగతీ లేదు. హెల్త్‌కార్డులు ఇస్తామని ప్రకటించారు...అదీ కనిపించడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. అదీ లేదు...ఇలా ఒక్క వర్గాన్నే కాదు....అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు చాలా అనుభవజ్ఞుడని, అన్నీ చేస్తాడనుకుంటే ఏమీ చేయలేక పోయాడు.
సాక్షి : ప్రాజెక్టులు, నీటి విషయంలో జిల్లాకు ఏ మేరకు ప్రయోజనం జరిగిందని భావిస్తున్నారు?
వీర రాఘవరెడ్డి : రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల్లో ఉన్న నేపథ్యంలో నిధుల పొదుపు పాటిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేయాలి. కానీ చిన్న పనికి సంబంధించి కూడా గోరంత జరిగితే కొండంతగా ప్రచార ఆర్భాటం చేస్తూ కోట్లకు కోట్లు తగిలేస్తున్నారు? కొంతమంది అధికారులు కూడా ప్రజల సొమ్మును తీసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నారు. ఇది కరెక్టు కాదు. వారికి అందించే జీతాలు కూడా ప్రజల సొమ్మేనని గమనించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ మరణం తర్వాత అన్నీ ఆగిపోయాయి. నీళ్ల విషయానికి వస్తే పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చామని గొప్పలు చెబుతున్నారు. కనీసం ఒక్క టీఎంసీ అయినా నికర జలాల కింద సీమకు కేటాయించామని చెప్పమనండి. ఎక్కడా లేదు. కేవలం ఏదో ప్రచారానికి వాడుకోవడానికి తప్ప మరొకటి కాదు. చివరకు కేంద్రంపై పోరాటానికి ధర్మ పోరాట దీక్షలు పార్టీ తరుపున చేసుకోవాలి....అలా కాకుండా కేంద్రంపై పోరాటం చేసి ప్రజల డబ్బును ఖర్చు పెట్టారు. ఎవరి సొమ్మని ఇలా పెట్టారు? ఇది క్షమించరాని నేరం.