kagaj nagar
-
కాగజ్‌నగర్ :PHC లో ఊడిపడ్డ పెచ్చులు :
-
గాయని మధుప్రియ వివాహం
-
తల్లిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు
-
ఉద్యోగాలు వచ్చుడు కాదు... ఊడుతున్నాయి
కాగజ్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, కొత్త ఉద్యోగాలు వచ్చుడు కాదు.. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయని టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం(సిర్పూర్ పేపర్ మిల్లు) కార్మికులకు మద్దతుగా నిర్వహించిన మహాధర్నాలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానికంగా విలేకరులతో సమావేశమయ్యారు. నిజాం నవాబు స్థాపించిన ఎస్పీఎం మూతపడడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు అంటూ ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పిన కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయని అన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 27 నుంచి సిర్పూర్ పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచిపోయి, మూతబడే స్థాయికి చేరుకోగా.. ఇప్పటివరకు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాలేదని అన్నారు. మిల్లు గుర్తింపు కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా సాక్షాత్తు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యుల బాధలు, ఆకలి కేకలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కార్మిక సమస్యలపై కళ్లు మూసుకుందని ధ్వజమెత్తారు. ఎస్పీఎం సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు. మిల్లు మూతపడిందనే మనస్తాపంతో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. -
మద్యపాన నిషేధానికి ఉద్యమం
కాగజ్‌నగర్ రూరల్ : మద్యపాన నిషేధానికి ఉద్యమిస్తామని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా ఉపాధ్యక్షురాలు అందె మంగ తెలిపారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై అన్ని హింసలకు కారణమైన మద్యపానాన్ని నిషేధించేందుకు క్రియాశీలక ఉద్యమం చేపడతామని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వంపై సారా వ్యతిరేక పోరాటంలో పీవోడబ్ల్యూ క్రియాశీల పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఐకేపీ సంఘాలకు రుణ మాఫీ వర్తింపజేయాలని, ఆర్పీలకు గౌరవ వేతనం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ 20న శ్రీరాంపూర్‌లో పీవోడబ్ల్యూ తూర్పు ప్రాంత 5వ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కాగజ్‌నగర్ పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలుగా ఆర్.కుమారి, అధ్యక్షురాలుగా కె.హారతి, ఉపాధ్యక్షురాలుగా సిహెచ్.నాగనందిని, ప్రధాన కార్యదర్శిగా బి.శ్యామల, సహాయ కార్యదర్శిగా బి.లావణ్య, కోశాధికారిగా సంతూర్బాయి, ప్రచార కార్యదర్శి రత్నం లక్ష్మీ ఎన్నికయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో మోడల్ మృతి
హైదరాబాద్/కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : ఇప్పుడిప్పుడే మోడలింగ్ రంగంలో ఎదుగుతున్న కాగజ్‌నగర్ యువకుడు హైదరాబాద్‌లో గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. బంజారాహిల్స్ ఎస్సై వై.మహేశ్, కాగజ్‌నగర్ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త జుగల్‌కిశోర్, జమునాబాయి దంపతుల చిన్నకుమారుడు మనీష్లోయా(27) మోడల్‌గా చేస్తున్నాడు. 2010లో మిస్టర్ ఇండియాగా ఎంపికయ్యాడు. బుధవారం రాత్రి హైటెక్స్‌లో జరిగిన ర్యాంప్ షోలో పాల్గొని గురువారం వేకువజామున మూడు గంటలకు మోటార్‌సైకిల్‌పై దోమలగూడలోని నివాసానికి బయల్దేరాడు. బంజారాహిల్స్ రోడ్డు నం.3మజీద్ చౌరస్తాకు రాగానే మోటార్‌సైకిల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మనీష్ తల బలంగా డివైడర్‌కు తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మనీష్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కాగజ్‌నగర్‌లో, ఇంటర్మీడియెట్, ఎంబీఏ, మోడలింగ్ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. వ్యాపార రంగంలో తనకు చేదోడువాదోడుగా ఉండాలని తండ్రి సూచించినా తనకిష్టమైన మోడలింగ్‌లో రాణిస్తున్నాడు. పూణె, బెంగళూర్, చెన్నయ్, దుబాయి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 34 ప్రదర్శనలు ఇచ్చాడు. తల్లిదండ్రులుగా తాము గర్వించే సమయంలో కొడుకు మృతి వార్త వినాల్సి వచ్చిందని జుగల్‌కిశోర్, జమునాబాయి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, టీడీపీ నాయకుడు రావి శ్రీనివాస్, జిల్లా మైనార్టీ నాయకుడు జాకీర్ షరీఫ్, నాయకులు కోనేరు కృష్ణ, కీర్తి శ్రీనివాస్, పట్టణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు షబ్బీర్‌హుస్సేన్, తదితరులు పరామర్శించారు. -
విషాదం మిగిల్చిన విహారయాత్ర
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : కాగజ్‌నగర్ మండలం మెట్పల్లి గ్రామ సమీపంలోని వాంకిడి వాగులో ఇద్దరు యువకులు గల్లంతై మృతిచెందారు. కాగజ్‌నగర్‌కు చెందిన కొందరు స్నేహితులు కలిసి వాంకిడి వాగు సమీపంలోకి విహార యాత్రకు వెళ్లారు. సరదాగా అందరూ కలిసి ఈత కొట్టగా ఇద్దరు గల్లంతై చనిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సర్‌సిల్క్ ఏరియాలో ఉన్న సుభాష్‌చంద్రబోస్ కాలనీకి చెందిన యువకులు బొద్దున సందీప్(23), బోనగిరి చందు(17), శ్రీకాంత్, వెంకటేశ్, అనిల్, రాకేశ్, అన్వేశ్, ఎన్.సాయికుమార్, అనిల్, సాయి, సురేశ్ సోమవారం ఉదయం మండలంలోని మెట్పల్లి గ్రామ సమీపంలో ఉన్న వాంకిడి వాగు వద్దకు విహార యాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు వంటలు చేసుకుని విందు చేసుకున్నారు. అనంతరం ఈత కొట్టేందుకు వాగులో దిగారు. 4.30గంటల ప్రాంతంలో వాగులో నుంచి బయటకు రాగా.. సందీప్, చందు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఈతగాళ్లను తీసుకెళ్లారు. రాత్రి కావడంతో వెతికేందుకు వారు నిరాకరించారు. దీంతో కాగజ్‌నగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలం ఆసిఫాబాద్ పోలీసుల పరిధిలోకి వస్తుందని చెప్పారు. మంగళవారం ఉదయం ఆసిఫాబాద్‌కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసి కాగజ్‌నగర్ రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పడంతో తిరిగి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎట్టకేలకు ఉదయం 11గంటలకు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా సందీప్, చందు మృతదేహాలు లభించాయి. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు, సీఐ రహెమాన్, ఎస్సై తిరుపతి సందర్వించారు. మృతుల కుటుంబాలను టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుల్లపల్లి బుచ్చిలింగం, నాయకులు కమల్‌కిశోర్, మాజీ కౌన్సిలర్ తిలక్, అశోక్, మురళీగౌడ్ తదితరులు పరామర్శించారు. ఆదుకుంటాడనుకున్న... బాగా చదివి ఆదుకుంటారనుకుంటే ఆ కుటుంబాల్లో విషాదమే మిగిలింది. సుభాష్‌చంద్రబోస్ కాలనీకి చెందిన బొద్దున సుధాకర్, స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులు. సందీప్ పెద్ద కుమారుడు. 1997లో తండ్రి సుధాకర్ మృతిచెందడంతో తల్లి స్వరూప విస్తారాకులు కుడుతూ కొడుకులను చదివిస్తోంది. వరంగల్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన సందీప్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. హౌస్ వైరింగ్ చేస్తూ తల్లికి చేదోడుగా ఉంటున్నాడు. ‘ఉద్యోగం వచ్చి ఆదుకుంటాడని అనుకున్న..’ అంటూ స్వరూప విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సదయ్య, రాజేశ్వరి దంపతుల చిన్న కుమారుడు చందు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేశాడు. రేపల్లెవాడలోని ఐటీఐలో చేరేందుకు ఫీజు చెల్లించాడు. ఎంతో భవిష్యత్ ఉన్న కొడుకు కళ్లముందే మరణించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు వారిద్దరి మృతిని అనుమానాస్పదంగా భావిస్తూ కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తిరుపతి తెలిపారు. సందీప్ తల్లి స్వరూప, చందు తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.