ఇప్పుడిప్పుడే మోడలింగ్ రంగంలో ఎదుగుతున్న కాగజ్‌నగర్ యువకుడు హైదరాబాద్‌లో గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
హైదరాబాద్/కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : ఇప్పుడిప్పుడే మోడలింగ్ రంగంలో ఎదుగుతున్న కాగజ్‌నగర్ యువకుడు హైదరాబాద్‌లో గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. బంజారాహిల్స్ ఎస్సై వై.మహేశ్, కాగజ్‌నగర్ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త జుగల్‌కిశోర్, జమునాబాయి దంపతుల చిన్నకుమారుడు మనీష్‌లోయా(27) మోడల్‌గా చేస్తున్నాడు. 2010లో మిస్టర్ ఇండియాగా ఎంపికయ్యాడు. బుధవారం రాత్రి హైటెక్స్‌లో జరిగిన ర్యాంప్ షోలో పాల్గొని గురువారం వేకువజామున మూడు గంటలకు మోటార్‌సైకిల్‌పై దోమలగూడలోని నివాసానికి బయల్దేరాడు. బంజారాహిల్స్ రోడ్డు నం.3మజీద్ చౌరస్తాకు రాగానే మోటార్‌సైకిల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
మనీష్ తల బలంగా డివైడర్‌కు తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మనీష్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కాగజ్‌నగర్‌లో, ఇంటర్మీడియెట్, ఎంబీఏ, మోడలింగ్ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. వ్యాపార రంగంలో తనకు చేదోడువాదోడుగా ఉండాలని తండ్రి సూచించినా తనకిష్టమైన మోడలింగ్‌లో రాణిస్తున్నాడు. పూణె, బెంగళూర్, చెన్నయ్, దుబాయి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 34 ప్రదర్శనలు ఇచ్చాడు. తల్లిదండ్రులుగా తాము గర్వించే సమయంలో కొడుకు మృతి వార్త వినాల్సి వచ్చిందని జుగల్‌కిశోర్, జమునాబాయి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, టీడీపీ నాయకుడు రావి శ్రీనివాస్, జిల్లా మైనార్టీ నాయకుడు జాకీర్ షరీఫ్, నాయకులు కోనేరు కృష్ణ, కీర్తి శ్రీనివాస్, పట్టణ వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు షబ్బీర్‌హుస్సేన్, తదితరులు పరామర్శించారు.