మహిమాన్వితుడు..కంగాల్ షా వలీ
- మార్చి 1.2 తేదీల్లో ఉరుసు
- ప్రసిద్ధిగాంచిన కిస్తీ వేడుకలు
- ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు
- తుంగా తీరంలో ఆకట్టుకుంటున్న దర్గా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కొలిచిన వారికి కొంగు బంగారం.. హజరత్ కంగాల్‌షా వలీ. ఈయన అసలు పేరు హజరత్ సయ్యద్ ఖుద్రతుల్లాషా ఖాద్రి. ఈ హజరత్ దర్గా పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో కర్నూలుకు పది కిలోమీటర్ల దూరంలో వెలిసింది. మార్చి నెల ఒకటో తేదీ ఉరుసు ప్రారంభం కానుంది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రానున్నారు. ఈ నేపథ్యంలో హజరత్ దర్గాపై ప్రత్యేక కథనం.
హజరత్.. బాగ్దాద్‌కు చెందిన మహెబూబ్ సుభాని (గౌసేపాక్ దస్తగిరి) (ర.అ) 13వ తరం వారసుడు. భారత దేశంలో మొగలులు సామ్రాజ్యం స్థాపించక ముందే హర్యానా రాష్ట్రంలోని సధౌరా ప్రదేశంలో ఈయన స్థిరపడ్డారు. అక్బర్ చక్రవర్తి తల్లి హమీదా స్థాపించిన ఇస్లాం యూనివర్సిటీకి హజరత్ తాత సయ్యద్ అబ్దుల్ ముకరిమ్ ఖాద్రీ వైస్ చాన్స్‌లర్‌గా ఉండేవారు. హజరత్ పూర్వీకులు చదువు, ఆధ్యాత్మిక అంశాల్లో ఆరితేరి ఉండటంతో మొగల్ సామ్రాజ్యంలోని చక్రవర్తులంతా వీరి కుటుంబం వద్ద శిష్యరికం పొందారు. ఔరంగజేబు మరణం తర్వాత రాజరిక పరిస్థితులు అధ్వానంగా మారాయి. ఆతర్వాత హజరత్ కుటుంబం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లింది. షాజహానాబాద్ (ఇప్పటి న్యూఢిల్లీ)లో ఉంటున్న హజరత్ క్రీ.శ. 1725లో కర్నూలుకు వచ్చారు.
బావాపురంలో సమాధి..
ప్రస్తుతం బావాపురం గ్రామం..ఒకప్పుడు క్రూరమృగాలు సంచరించే అటవీ ప్రాంతం. హజరత్ స్థిరపడ్డాక అక్కడ నివాసాలు ఏర్పడి గ్రామంగా అవతరించింది. దైవచింతన ద్వారా కుల మతాలకు అతీతంగా భక్తుల సమస్యలు ఆయన పరిష్కరించే వారు. తన ప్రసంగాల ద్వారా శిష్యులను (భక్తులను) సన్మార్గంలో నడిపించే వారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు వినేందుకు ముస్లింలతో పాటు అన్యమతస్తులూ వచ్చే వారు. కర్నూలు నవాబ్ అలాఫ్ ఖాన్–1.. హజరత్ వద్ద శిష్యరికం స్వీకరించారు. గ్రామం చుట్టూ ఉన్న ఐదు ఎస్టేట్ల జాగీరును బహూకరించినా హజరత్ స్వీకరించలేదు. కర్నూలు ప్రజలు హజరత్ వద్దకు వచ్చి విద్య, ఆధ్యాత్మిక విలువలు నేర్చుకునేందుకు వీలుగా నవాబు.. కర్నూలు నుంచి బావాపురానికి రోడ్డు వేయించారు. స్వామి 1766లో సమాధి అయ్యారు. ప్రస్తుతం హజరత్.. ఆరో ముని మనుమడు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రి..ఉరుసు నిర్వహిస్తున్నారు. ఉరుసు చివరి రోజున నిర్వహించే కిస్తీలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
సుందరంగా దర్గా..
మొదట సమాధి వరకే నిర్మించిన దర్గాను ఇప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా సుందరంగా తీర్చిదిద్దారు. చుట్టూ నాలుగు స్తంభాలతో తాజ్‌మహల్‌ను పోలి ఉండటం, భారీ ప్రవేశ ద్వారం, మదీనాలోని మస్జిదే నబ్వీని పోలిన ఆస్తానా గుమ్మజ్ కట్టించడంతో భక్తులకు ఇట్టే ఆకట్టుకుంటోంది. హజరత్ దర్గా తుంగభద్ర నదీ తీరంలో ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది. ఆవరణలో పచ్చని చెట్ల నీడ లభిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో కర్నూలు నగర వాసులు దీన్ని విహార స్థలంగా ఎంచుకున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ఈ ప్రాంతం నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రతిసారి ఎన్నికల ప్రచారాన్ని మొదట దర్గాను దర్శించుకున్న తర్వాతే ప్రారంభిస్తారు.
ఇలా చేరుకోవాలి..
హజరత్ కంగాల్‌షా వలీ దర్గాకు చేరుకోవాలంటే కర్నూలు కొత్త బస్టాండులో సుంకేసుల డ్యాం, రాజోలి గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించాల్సి ఉంది. పాత బస్టాండు నుంచి ఈ మార్గంలో ఆటోలు కూడా ఉంటాయి. భక్తులు బావాపురం దర్గా వద్ద ఏర్పాటు చేసిన స్టేజీలో దిగాల్సి ఉంటుంది.
ఒకటి నుంచి ఉరుసు
– సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రి
మార్చి నెల ఒకటో తేదీ నుంచి ఉరుసు ప్రారంభమవుతుంది. ఒకటిన గంధోత్సవం, బాణోత్సవం, రెండో తేదీ సాయంత్రం 4 గంటలకు కిస్తీ, రాత్రి ఖవ్వాలి కార్యక్రమాలు ఉంటాయి. ఉరుసుకు లక్ష మంది వచ్చే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.