కె.అగ్రహారం సొసైటీ అధ్యక్షుడి రాజీనామా
కడప అగ్రికల్చర్/ఖాజీపేట :
ఖాజీపేట మండలం కె.అగ్రహారం ప్రా«థమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు కిషోర్‌కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 7వ తేదీన ‘అగ్రహారం సొసైటీలో అడ్డంగా దోపిడీ’ శీర్షికన సాక్షిలో వార్త ప్రచురితమైంది. సొసైటీలో కొందరు డైరెక్టర్లు కలిసి దోపిడీ కొనసాగించారు. దీనిపై పూర్తి సమాచారంతో సాక్షి బయటపెట్టింది. దీంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పదవిలో కొనసాగడం ఇష్టంలేక అధ్యక్షుడు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కడపలోని పాత రిమ్స్‌లో ఉన్న డివిజన్ స్థాయి కో–ఆపరేటివ్ కార్యాలయానికి చేరుకుని అధ్యక్షుడు కిషోర్‌కుమార్ డీఎల్సీఓ గురుప్రకాష్కు రాజీనామాపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొంత సమస్యల కారణంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదే సందర్భంలో డీఎల్సీఓ మాట్లాడుతూ కిషోర్‌కుమార్ రాజీనామాను ఆమోదిస్తున్నామన్నారు. మళ్లీ ఎన్నిక నిర్వహించే వరకు ఉపాధ్యక్షుడు సొసైటీ అధ్యక్షుడుగా కొనసాగుతాడని అన్నారు.
yీ ఎల్ ఆదేశాలతోనే..
అగ్రహారం సొసైటీలో జరిగిన భారీ కుంభకోణం విషయమై ఖాజీపేట మండలంలో రైతుల్లో తీవ్ర చర్చ జరిగింది. దీనిపై గత రెండు రోజులుగా మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సమక్షంలో సొసైటీ డైరెక్టర్లతో తీవ్రంగా చర్చలు జరిగాయి. రైతులకు జరిగిన అన్యాయాన్ని వారు డీఎల్‌కు వివరించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎల్ వెంటనే సొసైటీ ప్రక్షాళనకు నడుంబిగించారు. అందులోభాగంగానే రాజీనామా చేయాలని సొసైటీ అధ్యక్షుడు కిషోర్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు. ఆయన చేసేశారు.
రికార్డుల సర్డుబాటు
గత రెండురోజులుగా సొసైటీలోని అక్రమాలను సక్రమం చేసేందుకు సిబ్బంది నానాతంటాలు పడుతున్నారు. విచారణకు వచ్చిన అధికారుల దగ్గర అంతా సవ్యంగా ఉంది.. అని చూపించేందుకు దొంగ సంతకాలతో రికార్డులను బిల్లును సిద్ధం చేస్తున్నారు. రిజిస్టర్ ఆఫీసులో మార్టిగేజ్ పనులను చకచకా కానిస్తున్నారు. అయితే ఈ విషయం అందరికీ తెలిసినా స్పందించాల్సిన ఉన్నతాధికారులు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకున్నారు తైవాన్ స్పెయర్లలో అందరికీ వాటాలు ముట్టిందని స్వయంగా సొసైటీ అధ్యక్షుడు చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. ఎక్కడ విచారణ జరిగితే తమ పేర్లు బయటపడతామోనని సొసైటీ సిబ్బందికి గడువు ఇచ్చి అన్ని సక్రమంగా చేయండి.. తర్వాత తాము వచ్చి పరిశీలిస్తాం అని సిబ్బందికి భరోసా ఇచ్చినట్లు సమాచారం
విచారణ చేపట్టరా?
ఇంత భారీ దోపిడీ జరిగినా ఇప్పటివరకు అధికారులు వచ్చి కనీస విచారణ చేపట్టకపోవడంపై అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి దాదాపు 1,020 మంది రైతులు నష్టపోయినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం దారుణమని రైతుసంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు అధికారులందరూ ఇందులో ఉన్నారు కాబట్టి స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. స్పేయర్‌కు వసూలు చేసిన డబ్బులు వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇన్చార్జిగా మల్లేశ్వర్‌రెడ్డి
అధ్యక్షుడి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని తాత్కాలికంగా బాధ్యతలను సింగిల్‌విండో ఉపాధ్యక్షుడిగా ఉన్న బత్తెన మలేశ్వర్రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు అందుకు డైరెక్టర్లు కూడా ఆమోదించారు. అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే చార్జి ఇచ్చేఅవకాశం ఉంది