అయినా నాకు బాధ లేదు...
‘‘ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద చిత్రాలన్నీ రొటీన్‌గా ఉంటున్నాయి. తక్కువ నిర్మాణ వ్యయంతో తీస్తున్న చిన్న చిత్రాలే కొత్తగా ఉంటున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాల కారణంగా నిర్మాతలు, పంపిణీదారులు నష్టపోతున్నారు. ప్రస్తుతం నిర్మాతలు మహారాజ పోషకుల్లా మారిపోయారు. నిర్మాతల శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని కాబట్టే, ఇలా మామూలుగా మిగిలిపోయాను. అయినా బాధ లేదు’’ అని హీరో శివాజీ అన్నారు.
రేవన్ యాదు దర్శకత్వంలో శివాజీ, కైనాజ్ మోతీవాలా జంటగా రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి నిర్మించిన ‘బూచమ్మా బూచోడు’ ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ - ‘‘ఓ ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన దంపతులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? అన్నదే ఈ చిత్రం కథ. హారర్, కామెడీ నేపథ్యంలో సాగే ఇలాంటి కథతో నాకు తెలిసి ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదు’’ అని చెప్పారు.