రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
పాలకొల్లు అర్బన్/యలమంచిలి : చించినాడ బైపాస్ రోడ్డులోని కాజ సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పాలకొల్లు రూరల్ సీఐ ఎ.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. పూలపల్లికి చెందిన కోలా అజయ్ (14), యలమంచిలి మండలం ఊటాడ గ్రామానికి చెందిన భారతి సుబ్బారావు ఇద్దరూ స్కూటర్‌పై చించినాడ వైపు వెళ్తుండగా అమలాపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎల్వీఆర్ ట్రావెల్ బస్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదస్థలంలో పడిఉన్న అజయ్, సుబ్బారావును సీఐ చంద్రశేఖర్ తన జీపులో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అజయ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుబ్బారావు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అజయ్ కాలు బస్సు బాయ్నెట్లో విరిగిపోయి ఉండడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. అజయ్ లజపతిరాయపేట మాంటిస్సోరీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. సుబ్బారావు తన తండ్రి కృష్ణతో కలిసి రొయ్యల చెరువులపై పనిచేస్తున్నాడు. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.