తల్లిదండ్రులను బెదిరిద్దామని.. విద్యార్థి కిడ్నాప్ డ్రామా
పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టం లేని ఓ విద్యార్థి తల్లిదండ్రులను భయపెట్టేందుకు కిడ్నాప్ డ్రామా ఆడాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ డ్రామాకు శుభం కార్డు వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం కాకర్ల గండితండాకు చెందిన ఆమ్రియా, కమ్లీబాయిల కుమారుడు వర్త్యా రమేష్(14) దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రమేష్ పాఠశాలకు వెళ్లడానికి అనాసక్తిని ప్రదర్శించేవాడు. ఎక్కువ సమయం స్నేహితులతో గడుపుతూ జులాయిగా తిరుగుతున్నాడు. దీనిని గుర్తించిన తల్లిదండ్రులు పలుమార్లు ప్రవర్తనను మార్చుకోవాలని అతడిని మందలించారు.
ఈక్రమంలో గత ఆదివారం కూడా కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రమేష్ ఎలాగైనా తన తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేద్దామని పథకం పన్నాడు. తానేం చేసినా ఇక వారు అడ్డురాకుండా ఉండేందుకు ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం రోజూమాదిరిగానే యూనిఫాం వేసుకుని సైకిల్‌పై పాఠశాలకు వచ్చాడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం తిని సివిల్ డ్రెస్‌లో తిరిగి పాఠశాలకు వచ్చాడు. షార్ట్ ఇంటర్వెల్ సమయంలో రమేష్ తన సైకిల్‌ను తోటి విద్యార్థి రాజుకు అప్పగించి బయటకు వెళ్లి వస్తానని చెప్పి పాఠశాల నుండి బయటపడ్డాడు. నేరుగా ఆటోలో పరిగికి, తర్వాత బస్సులో వికారాబాద్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి రైలులో పుణెకు వెళ్లాడు. రాత్రయినా కూడా కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు దోమ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
పసిగట్టిన పోలీసులు
పోలీసులు ఫోన్లో రమేష్‌ను సంప్రదించగా మొదట్లో స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత బాలుడు పోలీసులతో మాట్లాడాడు. తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు ఫోన్‌చేసిన ప్రతిసారీ రమేష్ పొంతన లేని కథనాలు చెబుతుండడంలో వారికి అనుమానం వచ్చింది. రమేష్ ఫోన్ నంబరును ట్రేస్ చేయగా మొదట్లో కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర నెట్వర్క్ కవరేజీలో ఉన్నట్లు తేలింది. దీంతో ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి రమేష్ తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో ఫుణెలో ఉన్న వారి బంధువులను అప్రమత్తం చేశారు. బంధువుల ఇళ్లలో వెతకాలని అక్కడున్న కొందరికి చెప్పారు. ఈక్రమంలో రమేష్ ఓసారి ఎస్ఐకి ఫోన్ చేశాడు. తాను కారు అద్దాలు పగులగొట్టి కిడ్నాపర్ల నుండి తప్పించుకున్నానని, ప్రస్తుతం పుణె రైల్వేస్టేషన్లో ఉన్నానని రమేష్ ఎస్ఐని నమ్మించే యత్నం చేశాడు. ఎస్ఐ అతడికి ధైర్యం చెప్పినట్లు నమ్మబలికి అప్పటికే అతడి కోసం వెదుకుతున్న బంధువులకు సమాచారం అందించారు.
దీంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని రమేష్‌ను తీసుకుని నేరుగా దోమ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ తతంగమంతా మంగళవారం, బుధవారం కొనసాగింది. బుధవారం ఇక్కడికి వచ్చాక ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి తనదైన శైలిలో రమేష్‌ను విచారించగా తల్లిదండ్రులను భయపెట్టేందుకే కిడ్నాప్ డ్రామా ఆడానని, తనను వరూ కిడ్నాప్ చేయలేదని వివరించాడు. డ్రామా మొత్తం పూస గుచ్చినట్లు వివరించారు. కిడ్నాప్ డ్రామా ఎట్టకేలకు సుఖాంతం అయింది.