కాకి బలాసనం
నిర్వచనం
ఈ ఆసనం సాధన చేస్తున్నప్పుడు కాకి నడుస్తున్నట్లు ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కాకి బలాసనం అంటారు.
ఎలా చేయాలంటే..?
పాదాలను పూర్తిగా నేలకు ఆనేటట్లు ఉంచి మోకాళ్ల మీద చేతులు ఉంచి కూర్చోవాలి. రెండు పాదాల మీద నుంచి మునివేళ్ల మీద లేవాలి. ఈ స్థితిలో శరీర బరువు మొదటి ఫొటోలో ఉన్నట్లు మునివేళ్లమీద ఉంటుంది.
ఇప్పుడు నిదానంగా కుడికాలిని లేపి ఒక అడుగు దూరంలో ముందుకు తీసుకురావాలి. ఈ స్థితిలో ఎడమకాలు వంగి ఉంటుంది. కుడి కాలు మోకాలి దగ్గర నుంచి పాదం వరకు నిటారుగా ఉంటుంది. శరీరం బరువు ఎడమకాలి మునివేళ్ల మీద ఉంటుంది.
ఇప్పుడు ఎడమకాలిని లేపి రెండు-మూడు అడుగుల దూరంలో పూర్తిగా పాదం నేల మీద ఆనేటట్లు ఉంచాలి. ఈ స్థితిలో కుడిమోకాలు వంగి ఉంటుంది, కుడికాలి మునివేళ్లు నేలను తాకి ఉంటాయి. శరీరం బరువు మునివేళ్ల మీద ఉంటుంది.
ఇలాగే ముందుకు నడవాలి. ఈ భంగిమ కాకి నడుస్తున్నట్లు ఉంటుంది. ఈ విధంగా ఎడమ కాలు మరియు కుడికాలుని మార్చి మార్చి కాకి వలె నడవాలి.
ఇలా ప్రతిరోజూ ఉదయం సాయంత్రం రెండు నిమిషాల పాటు నడుస్తూ ఉండాలి. ఇలా నడవ గలిగినంత సేపు నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగాలు
మోకాళ్లు శక్తిమంతం అవుతాయి. తొడలలో కొవ్వు తగ్గిపోతుంది. పాదాల వేళ్లు, అరిపాదం శక్తిమంతం అవుతాయి.
నడుస్తున్నప్పుడు పొట్ట మీద ఒత్తిడి కలుగుతుండడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
మలబద్దకం పోతుంది.
కాలేయం, ప్లీహం చైతన్యవంతం అవుతాయి.
ఏకాగ్రత పెరుగుతుంది.
ఆర్థరైటిస్ సమస్య తొలగిపోతుంది.
జాగ్రత్తలు
అధిక బరువు ఉన్నవాళ్లు చేయరాదు.
మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు చేయరాదు.
మోడల్: ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్
ఫొటోలు: శివ మల్లాల
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు
సప్తరుషి యోగవిద్యాకేంద్రం
హైదరాబాద్