కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న కాకినాడ వాసులు
శ్రీనగర్ : కాశ్మీర్ వరదల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన దంపతులు చిక్కుకున్నారు. దైగోలుపాడుకు చెందిన నాయుడు, వరలక్ష్మి రూరల్ డెవలప్మెంట్ ప్రోగామ్ కోసం కాశ్మీర్ వెళ్లారు. హెలీప్యాడ్ వద్ద వరదల్లో చిక్కుకున్నట్లు బాధితులు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 30మంది వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
మరోవైపు జమ్మూ కాశ్మీర్లో వరద ఉధృతి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. జలవిలయంతో తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పటివరకూ 47 వేల మంది బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినా, ఇంకా 4 లక్షలమందికిపైగా జనం జలదిగ్బంధంలోనే ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు, వరదనీరు తగ్గనిచోట్ల బాధితులు ఇంకా ఇళ్లపైకప్పులపైనే గడుపుతున్నారు. భారీవర్షాలు వరదల్లో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లుకూలడం వంటి సంఘటనల్లో ఇప్పటివరకూ దాదాపు 200మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నావికాదళం నిర్విరామంగా పాల్గొంటున్నాయి.