అయోమయం... అదే భయం!
కాకినాడ క్రైం : గ్యాస్పైపులైను పేలుడు ఘటనలో మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ 20 మంది మృతి చెందగా, మంగళవారం అర్ధరాత్రి వానరాశి వెంకటరత్నం(46) మృతి చెందడంతో మృతుల సంఖ్య 21కి చేరింది. కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు వైద్యులు చెబుతున్నారు.
చికిత్స పొందుతున్న వారు వీరే...
కాకినాడ అపోలో ఆస్పత్రిలో వానరాశి దుర్గాదేవి, ఆమె కుమారులు ఏడేళ్ల వానరాశి మోహన వెంకటకృష్ణ, ఎనిమిదేళ్ల మధుసూదన్, ఇన్స్పెక్టర్ కృష్ణన్, అతడి భార్య మేఘన, 65 ఏళ్ల బోణం పల్లాలమ్మ చికిత్స పొందుతున్నారు. ట్రస్ట్ ఆస్పత్రిలో పల్లాలమ్మ కుమారుడు బోణం పెద్దిరాజు, కోడలు రత్నకుమారి, మనుమరాళ్లు అర్చిక, ఝాన్సీ, కళ్యాణి, కుమార్తె రేకపల్లి సత్యవతి, సాయిసుధలో రుద్ర సూరిబాబు చికిత్స పొందుతున్నారు. వారిలో ఏడేళ్ల మోహన్ కృష్ణ, 65 ఏళ్ల పల్లాలమ్మ, 40 ఏళ్ల పెద్దిరాజు, 35 ఏళ్ల రత్నకుమారి, 56 ఏళ్ల కృష్ణన్ పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
గ్యాస్ పేలుడు ధాటికి వారి శరీరాలతో పాటు అంతర్భాగాలు కాలిపోయి, వారి పరిస్థితి విషమిస్తోందంటున్నారు. అంతర్భాగాలు పనిచేయక పోవడం వల్ల మృత్యువాత పడుతున్నారని చెబుతున్నారు. ఓఎన్జీసీ సీఐఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కృష్ణన్, అతడి భార్య మేఘన ప్రమాదంలో గాయపడి రాజమండ్రి స్వతంత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, తొలుత వారిని అధికారులు గుర్తించలేదు. అనంతరం విషయం తెలుసుకుని వారిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే తన తల్లిదండ్రులను మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలిస్తామని వారి కుమారుడు అధికారులకు తెలిపాడు. అత్యంత పవర్ఫుల్ మందులు వినియోగిస్తున్నందున సాధ్యమైనంత వరకు వారిని ఇక్కడే ఉంచాలని వైద్యులు సూచించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.
13 మంది కాకినాడలో...
ప్రస్తుతం కాకినాడలోని మూడు ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఒక్కొక్కరుగా మృతి చెందుతుండడంతో క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆందోళన నెలకొంది. చిన్నారి మోహన్ కృష్ణ తల వెనుక భాగం, ముఖం తీవ్రంగా కాలిపోవడంతో అతడి తండ్రి నరసింహమూర్తి వేదనకు అంతే లేకుండా పోతోంది.