ప్రాణాలు తీసిన హోర్డింగ్..
కాకినాడలో యువతి దుర్మరణం
కాకినాడ క్రైం : రోడ్డుపై నడచుకుంటూ వెళుతున్న ఓ యువతిపై అకస్మాత్తుగా భవనంపై నుంచి ఫ్లెక్సీ కూలిపోవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పిల్లకాలువ వీధికి చెందిన వాసంశెట్టి శాంతి(21) శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తండ్రి చంద్రనారాయణ, అక్క మహేశ్వరి, బావ కేవీవీ నరసింహారావుతో కలసి అక్కకూతురు ఫస్ట్ బర్త్‌డే కోసం షాపింగ్ చేసేందుకు కాకినాడ మార్కెట్‌కి బయలుదేరి వెళ్లింది. కల్యాణి జ్యూయలర్ దుకాణంలో బంగారం కొనుగోలు చేశారు. అనంతరం సంతమార్కెట్లో బట్టలు కొనుగోలుకు వెళ్లారు. మధ్యాహ్నం రెండు కావడంతో ఆకలివేసి అంతా జ్యూస్ తాగారు. సమోసా తింటానంటూ కొనుక్కునేందుకు శాంతి వెళుతుండగా సంతమార్కెట్ ఎస్ఆర్కే సెంటర్లోని ఓ భవనం రెండో అంతస్తుపై నుంచి ఫ్లెక్సీ కూలి ఆమెపై పడింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయం కావడంతో కొన ఊపిరితో ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు తండ్రి, స్థానికులు చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
రెండు రోజుల క్రితమే ఇంద్రపాలెం వచ్చింది..
శాంతి పటవల పైడా కళాశాల్లో బీఫార్మసీ పూర్తి చేసింది. హైదరాబాద్‌లో ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రెండు రోజుల క్రితం ఇంద్రపాలెం వచ్చింది. ఇంతలో షాపింగ్‌కి వెళ్లి ఫ్లెక్సీ కూలిన ఘటనలో దుర్మరణం చెందడంపై తండ్రి, అక్క కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమార్తెను ఒడిలోకి తీసుకుని ఆ తండ్రి హృదయ విధారంగా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. ప్రమాద విషయం తెలియగానే సంఘటన స్థలానికి త్రీటౌ¯ŒS సీఐ దుర్గారావు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన భవన యాజమాని, యాడ్ ఏజెన్సీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.