పెట్టిన ఎఫర్ట్‌కు రిజల్ట్ వచ్చింది
తమిళసినిమా: పెట్టిన ఎఫర్ట్‌కు తగ్గ రిజల్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇదీ వీఐపీ–2 చిత్రం గురించి ఆ చిత్ర కథకుడు, మాటల రచయిత, కథానాయకుడు ధనుష్ వ్యక్తం చేసిన అభిప్రాయం. కలైపులి ఎస్.థానుతో కలిసి ఆయన వండర్‌బార్ ఫిలింస్ సంస్థ నిర్మించిన చిత్రం వీఐపీ–2. ఇంతకు ముందు ధనుష్ నటించి నిర్మించిన వేలైఇల్లా పట్టాదారి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రానికి రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్యరజనీకాంత్ దర్శకురాలు.
వీఐపీ–2 చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం స్థానిక అన్నాశాలైలోని ఒక నక్షత్రహోటల్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కలైపులి ఎస్.థాను మాట్లాడుతూ వీఐపీ–2 చిత్రం తాము ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధిస్తోందన్నారు. ఇప్పటికే తమిళనాడులో రూ.50 కోట్ల వసూళ్లు సాధించిందని తెలిపారు.అదే విధంగా కేరళలో ఇప్పటి వరకూ ధనుష్ చిత్రాల కలెక్షన్లను అధిగమించిదని తెలిపారు.
వీఐపీ–2 చిత్రాన్ని తమిళంలో పాటు, తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కించిన విషయం తెలిసిందేనని, అయితే హిందీ వెర్షన్‌ను కొనుగోలు చేసిన పీవీఆర్ సంస్థ ముందు తమిళంలో విడుదల చేయండి, ఆ తరువాత హిందీలో రిలీజ్ చేస్తామని అన్నారని తెలిపారు. ఇప్పుడు ఈ చిత్ర వసూళ్లను చూసిన ఆ సంస్థ నిర్వాహకులు మొదట ఉత్తరాదిలో 450 థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకుని, ఇప్పుడు 1200 థియేటర్లలో ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారని, అదే విధంగా తెలుగులో ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
కథానాయకిగా సౌందర్యరజనీకాంత్
అనంతరం నటుడు వివేక్ మాట్లాడుతూ రజనీకాంత్ వారసురాలిగా రంగప్రవేశం చేసిన ఈ చిత్ర దర్శకురాలు సౌందర్య ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. త్వరలో కథానాయకిగా పరిచయం అవ్వడానికి కథలు వింటున్న సౌందర్యకు శుభాకాంక్షలు అందిస్తున్నానని అన్నారు.
తమిళంలో స్టైలిష్ కథానాయికలను చూసి చాలా కాలమైందని, సౌందర్యతో ఆ లోటు తీరనుందని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు ధనుష్ మాట్లాడుతూ వీఐపీ–2 చిత్ర కథను వినిపించగానే తాను బ్రహ్మాండంగా ఉందని అన్నారన్నారు. తమ ఎఫర్ట్‌కు దక్కిన రిజల్ట్ వీఐపీ–2 అని పేర్కొన్నారు. వీఐపీ–3 చిత్రం కూడా ఉంటుందని, కథ రెడీ అయిన తరువాత దానికి ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుందనిపిస్తే వారు చేస్తారని చెప్పారు.