కలకోవలో ఎస్ఎంసీ ఎన్నిక వాయిదా
కలకోవ (మునగాల) : మండలంలోని కలకోవ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. శుక్రవారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఉద్రిక్త వాతావరణలో ఎస్ఎంసీ ఎన్నికలు జరగడంతో ముందస్తుగా మునగాల ఎస్ఐ గడ్డం నగేష్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ ఎన్నికలకు సీపీఎం వర్గీయులు గైర్హాజరు కాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమికి చెందిన ఓటర్లు మాత్రమే పాల్గొన్నారు. పాఠశాలలోని ఒకటవ తరగతిలో 24మందికి 16మంది హాజరు కాగా, రెండో తరగతిలో ఏడుగురికి ఆరుగురు, నాలుగో తరగతిలో 17మందికి 9మంది హాజరు కాగా హెచ్ఎం జూలకంటి వెంకటరెడ్డి ఎన్నికలు నిర్వహించారు. తొమ్మిది మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదిలా ఉండగా మూడో తరగతిలో 10మందికి గాను నలుగురు, ఐదో తరగతిలో 16మందికి ఏడుగురు మాత్రమే హాజరు కావడంతో కోరం లేక రెండు తరగతులకు సంబంధించిన ఎన్నిక జరుగలేదు. దీంతో ఎస్ఎంసీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా వేశారు. ఇదిలా ఉండగా సాయింత్రం వరకు డైరెక్టర్ల ఎన్నికకు సమయం ఇవ్వాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి వర్గీయులు ఎన్నికల పరిశీలకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఎప్పుడు నిర్వహించేది మండల విద్యాధికారి అనుమతితో తేదీని ప్రకటిస్తామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. శనివారం ఎన్నికైన తొమ్మిది మంది డైరెక్టర్లలో కల్పన, కవిత, ఎం.లక్ష్మి, సీహెచ్.కవిత, ఉపేంద్ర, సోమయ్య, రమణ, శోభారాణి, బెల్లంకొండ కోటయ్య ఉన్నారు.