దండం పెడతా.. బిడ్డనివ్వండమ్మా..!
పాప లేకుంటే బతకలేనమ్మా...!
పెంచిన మమకారంతో తల్లడిల్లిన మాతృమూర్తి
నిబంధనల చట్రం ముందు మూగరోదన
లేదంటే కేసులు పెడతామన్న అధికారులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లేకలేక పుట్టిన బాబు పురిట్లోనే చనిపోవడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళకు ఓ మాతృమూర్తి ఇచ్చిన పాప దేవత ఇచ్చిన వరంగా మారింది. ఆ పాపను ఆమె రెండు నెలలుగా తన కంటిపాపగా చూసుకుంటూ అల్లారుముద్దుగా పెంచుతోంది. ఐతే పాపను ఇవ్వడం.. తీసుకోవడం చట్టబద్ధంగా జరగలేదంటూ ఐసీడీఎస్ అధికారులు పాపను కన్నతల్లి చెంతకు చేర్చడంతో ఆ పెంపుడు తల్లి రోదన వర్ణణాతీతంగా మారింది. హసన్‌పర్తి మండలం ఆరెపల్లి గ్రామంలో గురువారం జరిగిన స్థానికులను కంటతడి పెట్టించింది. వివరాలిలా ఉన్నారుు.
హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లి సమీపంలోని తండాకు చెందిన క్రాంతి, శ్రీను దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నవంబర్ 2న మూడో సంతానంగా క్రాంతికి మళ్లీ ఆడశిశువే జన్మించింది. కూలీ చేసుకుని జీవించే తమకు ముగ్గును బిడ్డలను సాదడం కష్టమని వారు మదనపడుతుండగా నవంబర్ 8న ఇదే మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన క్యాతం మంజులకు పురిట్లోనే బిడ్డ చనిపోయిందని తెలిసింది. తాము వద్దనుకున్న బిడ్డను వారికి ఇస్తే సాదుకుంటారేమోనని ఆలోచనకు వచ్చారు.
తెలిసిన వారి ద్వారా సంప్రదించగా అప్పటికే పిల్లల కోసం పుట్టెడు దుఃఖంలో ఉన్న మంజుల కుటుంబసభ్యులు అందుకు సరేనన్నారు. నోటరీ ద్వారా దత్తత కార్యక్రమం పూర్తి చేసుకుని పాపను మంజులకు అప్పగించారు. అప్పటికే ఆస్పత్రిలోనే ఉన్న ఆమె చెంతకు పాప చేరడంతో ఆనందించింది. తనకు దేవుడు బిడ్డను ఈ రూపంలో ఇచ్చాడనుకుని తన పాలు పట్టి బిడ్డను పెంచుకుంటోంది. రెండు నెలలు దాటింది. పాప ఆరోగ్యంగానే ఉంది. మంజుల ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అత్తగారి ఇంటి వద్ద ఉంటోంది.
ఈ క్రమంలోనే ఆరేపల్లిలోని అంగన్వాడీ టీచర్ ద్వారా విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. క్రాంతిని విచారించగా ముందు విషయం చెప్పకపోయినా తర్వాత చెప్పకతప్పలేదు. దీంతో ఐసీడీఎస్ సిబ్బంది జమ్మికుంటలో ఉన్న మంజులకు, ఆమె భర్త రఘుకు ఫోన్ చేసి పాపను ప్రభుత్వ అధికారులకు అప్పగించాలని చెప్పారు. కాదు.. కూడదంటే ఇబ్బంది పడతారని, తాము కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో వారు ఆరెపల్లిలోని బంధువుల ఇంటికి గురువారం వచ్చారు. అక్కడికి సీడీపీఓ కళాకుమారి, సూపర్వైజర్ సుమితాదేవి వెళ్లి పరిస్థితిని వివరించారు. సుమారు మూడు గంటలపాటు కౌన్సెలింగ్ నిర్వహించి బిడ్డను తిరిగి ఇచ్చేందుకు మంజులను ఒప్పించారు.
తీసుకునేందుకు రాని తల్లి..
బిడ్డను తిరిగిచ్చేందుకు మంజులను ఒప్పించిన అధికారులకు ఎంతసేపటికి కన్నతల్లి బిడ్డను తీసుకునేందుకు రాకపోవడంతో వారు తలలు పట్టుకున్నారు. దీంతో అధికారులు పాపను శిశుగృహకు తరలించే ప్రయత్నం చేయడంతో మంజుల బోరుమంది. తమ పాప సీసా పాలు తాగలేదని, తల్లి పాలు మాత్రమే తాగుతుందని విలపించింది. సీసా నోట్లో పెడితే ఏడుస్తుంది.. రొమ్ము నోట్లో పెడితేనే ఊరుకుంటుంది అంటూ బిడ్డను తీసుకుని పాలిచ్చింది. అక్కడున్నవారు కూడా అధికారులను శిశుగృహకు వెళ్లొద్దని, కేసులు వద్దని వేడుకున్నారు. దీంతో బైరాన్‌పల్లి అంగన్వాడీ టీచర్ సమక్షంలో పాపను తీసుకెళ్లి తల్లి క్రాంతికి అప్పగించారు.
తల్లి బాధ తెలిసే ఇచ్చా : క్రాంతి
అధికారులు బిడ్డను అప్పగించే క్రమంలో క్రాంతిని పలు ప్రశ్నలు వేశారు. ఇలా చేస్తే ఆడ పిల్లలను అమ్మినట్లు కేసవుతుంది. మీకు వద్దనుకుంటే మాకు(అధికారులకు) ఇవ్వాలే కానీ ఇలా చేయొద్దని అనడంతో తమకు బిడ్డలు ఎక్కువై ఇవ్వలేదని పురిట్లో బిడ్డ చనిపోయి ఆ తల్లి దుఃఖంలో ఉందని తెలిసి ముగ్గురు బిడ్డల్లో ఒకరిని ఇచ్చానని క్రాంతి సమాధానమిచ్చింది. ఇబ్బంది కావొద్దనే లాయర్ దగ్గర కాగితం కూడా రాసుకున్నామంటూ సమాధానం చెప్పింది. దీంతో తామే తీసుకెళ్తామనడంతో తన బిడ్డను తనకే ఇవ్వమని తీసుకుంది. ఇదిలా ఉండగా బిడ్డను తిరిగి తీసుకోవడం తమకు మంచిది కాదని, అధికారులు చెపితే వారి నిబంధనల ప్రకారమే మంజులకు తిరిగి అప్పగిస్తానని క్రాంతి, శ్రీను దంపతులు అన్నారు.
పాప లేకుంటే బతకలేను : మంజుల, పెంపుడు తల్లి
రెండు నెలలుగా పాపతో అనుబంధం ఏర్పడింది. నేను లేకుంటే పాప ఉండదు. పాప లేకుంటే నేను బతకలేను. మీ కు దండం పెడతా ఏమైనా చేసి బిడ్డను నాకు అప్పగించండి. మా ఆస్తిపాస్తులు రాసిస్తాం. బిడ్డను మాత్రం చట్టం పేరు చెప్పి నా నుంచి దూరం చేయొద్దు.
చట్ట ప్రకారం తీసుకుంటే తప్పులేదు
దత్తత తీసుకున్నామని చెబితే సరిపోదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ పని జరగాలి. తల్లి బాధ చూడలేక మానవతా ధృక్పథంతో కౌన్సెలింగ్ చేసి పాపను కన్నతల్లికి అప్పగించాం. లేదంటే నిబంధనల ప్రకారం పోలీసు కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇరుపక్షాలను వచ్చి ఐసీడీఎస్ పీడీని కలిసి పరిస్థితి వివరించమని చెప్పాం. నిబంధనలకు లోబడి వారికి మా వంతు సహకారం అందిస్తాం.
- కళాకుమారి, సీడీపీఓ