వైభవంగా కలశాభిషేకం
తణుకు : వందల మంది మంది మహిళలు శిరస్సుపై కలశాలు ధరించి ఊరేగింపులో పాల్గొనడంతో గ్రామంతా సందడి నెలకొంది. అంతటా భక్తిభావం పొంగిపొర్లింది. తణుకు మండలం దువ్వ గ్రామంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వేంచేసియున్న శ్రీ పర్వత వర్థినీ సమేత శ్రీ నాగేశ్వరస్వామి వారి దేవాలయంలో శ్రీ మహా రుద్రయాగ మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సహస్ర కలశాభిషేక పవిత్రోత్సవాన్ని నిర్వహించారు. సుదర్శన హోమం, మహారుద్రాహవనం, మహా పూర్ణాహుతి జరిపారు. తొలుత సుమారు 1500 మంది మహిళలు గ్రామంలో కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ వైదిక ఆగమ సలహాదారు జంధ్యాల వెంకట జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్చకులు జంధ్యాల బాలకృష్ణ, కామర్సు సూర్య రామారావు, యాగ నిర్వాహక కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.