Kalayan Mandapam
-
భూమిపూజ రసాభాస
► ఉద్రిక్తతల నడుమ కల్యాణమండపానికి శంకుస్థాపన ► టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాలు బాహాబాహీ ► 21మంది అరెస్టు, విడుదల ► ఎమ్మెల్యే అరాచక పాలన నశించాలంటూ ర్యాలీ, రాస్తారోకో ► గ్రామాల్లో చిచ్చుపెట్టొద్దని మిలట్రీనాయుడు కన్నీరు కల్యాణమండప నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చోడవరం పంచాయతీ శివారు అన్నవరంలో రసాభాసగా మారింది. ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ వివాదం శుక్రవారం తారాస్థాయికి చేరుకుంది. అధిక శాతం మంది గ్రామస్తులు మండపం నిర్మాణం వద్దని ప్రాథేయపడినా అధికారపార్టీ ఎమ్మెల్యే రాజుతోపాటు నాయకులు కనికరించలేదు. తమను చంపి కట్టుకోండంటూ మొత్తుకున్నా..మీరు ఎలా పోతే మాకేంటి మాకు నచ్చిందే చేస్తాం అన్నట్టు వ్యవహరించారు. బందోబస్తు నడుమ శంకుస్థాపన చేపట్టారు. అడ్డుకోబోయిన 21 మంది వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు, మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచీపై విడుదల చేశారు. చోడవరం టౌన్: పోలీసు బందోబస్తుతో అధికారపార్టీ సర్పంచ్ దొమ్మేసి అప్పలనర్సతో పాటు నాయకులు, అధికారులు శుక్రవారం ఉద యం 6 గంటలకే అన్నవరం గ్రామానికి చేరుకున్నారు. కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకొని అడ్డగిం చారు. తోపులాట చోటుచేసుకుంది. ఒకానొక దశలో అధికారపార్టీ వర్గం దాడికి సిద్ధమైంది. పోలీసులు ఇరు వర్గాలను చెదర గొట్టారు. అదే సమయానికి వైఎస్సార్సీపీ నాయకులు గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు అండగా నిలి చారు. మండపం నిర్మాణానికి కేటాయించిన స్థలా నికి చెరోవైపు ఇరువర్గాలు చేరుకున్నాయి. మండపం నిర్మించాలంటూ టీడీపీ వర్గం, తమను చంపిన నిర్మించుకోండి అంటూ గ్రామస్తులు పోటా పోటీగా నినాదాలు చేశారు. నిర్మాణం చేపడితే ఆత్మహత్య చేసుకుంటామంటూ కొందరు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కలసిమెలిసి ప్రశాంతంగా ఉన్న గ్రామస్తులను విడదీయొద్దని మరి కొందరు వేడుకున్నారు. గ్రామస్తులకు ఇష్టం లేకుండా నిర్మాణాలు చేపట్టాలని ఏచట్టంలో ఉందో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు. శంకుస్థాపన పనులను ఎవరూ అడ్డుకోరాదంటూ సీఐ శ్రీనివాసరావు గ్రామస్తులను హెచ్చిరించారు. సోమవారం వరకు పనులు ఆపాలని వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు సీఐని కోరగా.. ఈ రోజు కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతారని సోమవారం నుంచి పనులు మొదలు పెడతారని సీఐ పేర్కొన్నారు. శంకుస్థాపనను అడ్డుకోబోయిన వైఎస్సార్సీపీ నాయకులతో పాటు గ్రామస్తులు, మహిళలు 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము వాహనాల్లో రామంటూ వారంతా అన్నవరం గ్రామం నుంచి పోలీసు స్టేషన్ వరకూ ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్యే అరాచక పాలన నశించాలని, ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొత్తూరు జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఏడోసారి శంకుస్థాపన.. గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు తీసుకెళ్లిన వెంటనే సర్పంచ్ డి.అప్పలనర్స పోలీసుల పహారాలో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఇలా శంకుస్థాపన చేయడం ఇది ఏడోసారి. ఐదేళ్లుగా రూ.5లక్షలు కేటాయించానని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎప్పటికప్పుడు చెప్పుకొస్తూ ఎమ్మెల్యే రాజు ఆరుసార్లు శంకుస్థాపనలు చేపట్టారు. ఎన్నటికీ నిర్మాణం చేపట్టక పోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని కోరి రూ.18 లక్షలు మంజూరు చేయించడంతో ఉలిక్కిపడిన ఎమ్మెల్యే హైడ్రామా నడుమ దగ్గరుండి ఏడోసారి శంకుస్థాపన చేయించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు.. శంకుస్థాపన చేస్తున్నారని తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే మిలట్రీ నాయుడు అన్నవరం చేరుకున్నారు. అక్కడి భయంకర వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజు గొడవలు రేపుతున్నారని పేర్కొన్నారు. తగాదాలు సృష్టించి ఎన్నో అనర్థాలకు కారకుడు అవుతున్నాడని అన్నారు. అక్కడ ఉన్న సీఐ, ఎస్ఐలను పిలిచి ఎవరి మీద చేయిచేసుకోవద్దని కోరారు. ఐదేళ్లగా నిర్మాణం చేపట్టని ఎమ్మెల్యే కావాలని ఇప్పుడు రాద్ధాంతం సృష్టిస్తున్నాడని అన్నారు. – జి.ఎర్రునాయుడు ఎమ్మెల్యే వల్లే గొడవలు.. వారం రోజులుగా గొడవలకు ఎమ్మెల్యేయే కారణమని పాల సంఘం అధ్యక్షుడు పుల్లేటి సూరిబాబు అన్నారు. ఐదేళ్లుగా కల్యాణమండపం నిర్మాణానికి ఎమ్మెల్యే చుట్టూ తిరిగానని అప్పడు ప్రతీసారీ శంకుస్థాపనలు తప్ప పనులు చేపట్టలేదన్నారు. గ్రామస్తులు రూ.3లక్షలు ఇస్తే విశాఖ డెయిరీ నుంచి రప్పిస్తానని అనడంతో ఒకదశలో మూడు లక్షలు పట్టుకొని ఎమ్మెల్యే వద్దకు వెల్లానన్నారు. దానిని కనకమహాలక్ష్మి బ్యాంకులో డిపాజిట్ చేయమన్నారు. ఎంతకూ పనులు చేపట్టకపోవడంతో ఆ నిధులు తీసుకొచ్చి పాలసంఘం అకౌంటులో వేశాను. వైఎస్సార్సీపీ నాయకులను కలిసి సమస్య వివరించాను.వారు వెంటనే స్పందించి ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి రూ.18 లక్షలు మంజూరు చేయించారు. దీనిని తట్టుకోలేని ఎమ్మెల్యే గ్రామంలోని కొందరిని రెచ్చగొట్టి వారికే కాంట్రాక్టు ఇచ్చి గొడవలు రేపారు. పుల్లేటి సూరిబాబు ప్రస్తుతం రూ.5లక్షలే ఉన్నాయి.. కల్యాణ మండపం నిర్మాణానికి ప్రస్తుతం ఎస్డీఎఫ్ నిధులు రూ.5 లక్షలే ఉన్నాయని డీఈ జి.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. పోలీసు బందోబస్తు, గొడవలు నడుమ ఎందుకు శంకుస్థాప చేయాల్సి వచ్చిందని విలేకరులు ప్రశ్నించగా.. ఈ స్థలాన్ని పంచాయతీ తమకు అప్పగించిందన్నారు. ఉన్న నిధులతో పనులు ప్రారంభిస్తామని, మూడు నెలల తరువాత మరో రూ.15లక్షలు విడుదలవుతాయని తెలిపారు. – జి.ఎస్.ఎస్.ప్రసాద్ -
పుష్కరకాలంగా పునరుద్ధరణ !
♦ నత్తే నయంలా వేయిస్తంభాల ఆలయ పునరుద్ధరణ ♦ పడుతూ.. లేస్తూ సాగుతున్న కల్యాణ మండప నిర్మాణ పనులు ♦ పనులు ప్రారంభమై ఈ నెల 13కు పన్నెండేళ్లు పూర్తి ♦ చివరలో పైకప్పు దశలో ఆగిన వర్క్స్.. పెండింగ్‌లో రూ.83 లక్షలు.. ♦ ఏడాదిగా ఎక్కడి పనులు అక్కడే.. వరంగల్‌కు చారిత్రక గుర్తింపు తెచ్చే వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండప నిర్మాణ పరిస్థితి దయనీయంగా మారింది. పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కోసం మొదలైన పనులు ఎంతకీ పూర్తి కావడం లేదు. 12 ఏళ్లుగా కల్యాణ మండప నిర్మాణం సాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు వచ్చి వెళ్లడమే గానీ.. ప్రాచీన నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. రూ.3.48 కోట్ల అంచనా వ్యయంతో 2005 జూలై 13న పనులు మొదలు పెట్టగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షి, వరంగల్ : చారిత్రక వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండప నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. రూ.3.48 కోట్ల అంచనా వ్యయంతో 2005 జూలై 13న ప్రారంభించిన పనులు.. పష్కర కాలం గడిచినా... పూర్తి కాలేదు. ఆలయ పునరుద్ధరనలో భాగంగా మొదటగా పాత మండపాన్ని పూర్తిగా తొలగించి.. శిల్పాలు, శిలలను పద్మాక్షి ఆలయం సమీపంలో పడేశారు. ఆ తర్వాత పునాది పనులకు ఐదేళ్లు పట్టింది. పునాది నిర్మాణం ఆలస్యం కావడంతో తొలగించిన శిలలు ఐదేళ్లపాటు పద్మాక్షి ఆలయం సమీపంలో దుమ్ముకొట్టుకుపోయాయి. వీటిని పట్టించుకునే నాథుడు కరువైపోవడంతో కొన్ని శిలలు తమ రూపును కోల్పోయాయి. పెరిగిన అంచనా.. కల్యాణ మండపం పనులు మధ్యలో వదిలేయడంపై నలువైపులా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి అంచనాలు సవరించడంతో పునరుద్ధరణ వ్యయం రూ.7.53 కోట్లకు చేరుకుంది. ఎట్టకేలకు కల్యాణ మండపం నిర్మాణ పనులు 2010 ఫిబ్రవరి 25న తిరిగి మొదలయ్యాయి. రూపుకోల్పోయిన 132 పిల్లర్లు, 160 బీమ్స్ శిలలు, శిల్పాలను తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్ ఆధ్వర్యంలో 50 మందితో కూడిన బృందం తిరిగి చెక్కారు. కల్యాణ మండపం పునర్నిర్మాణంలో ప్రధానమైన శాండ్బాక్స్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించిన పునాది, దానిపై మీటరు మందంతో డంగు సున్నం, గ్రాన్యువల్ ఫైల్స్‌తో కూడిన లేయర్ నిర్మాణం 2012 చివరి నాటికి పూర్తయింది. అప్పటి నుంచి ఐదేళ్లుగా ఏడు వరుసల ప్రదక్షిణ పథం, నాలుగు వరుసలు ఉండే కక్షాసనం, ఆపై గోడల వరకు నిర్మాణం చేపట్టారు. పైకప్పు వేస్తే కల్యాణ మండప నిర్మాణ పనులు పూర్తవుతాయి. చివరి దశలో మరోసారి పనులు నిలిచిపోయాయి. ఏడాదిన్నరగా ఒక్క రాయి ఇటు తీసి అటు వేయలేదు. 2010–11లో సవరించిన అంచనాల ప్రకారం ఇంకా రూ. 83 లక్షలు మంజూరు చేయాల్సి ఉంది. ఈ నిధుల రాకపోవడంతో చివరి దశలో పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇదీ వైభవం వేయిస్థంబాల గుడిని క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు వరంగల్‌లో నిర్మించాడు. ఈ ఆలయం వేదికగా జరిగే సాంస్కృతిక, థార్మిక కార్యక్రమాలకు కళ్యాణమండపం వేదికగా ఉండేది. కాకతీయుల శకం ముగిసిన తర్వాత తుగ్లక్ సేనలు జరిపిన దక్షిణ భారత దండయాత్రలో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ తర్వాత కాలక్రమంలో కళ్యాణమండపం దక్షిణం వైపు ప్రవేశద్వారం కుంగిపోయింది. కళ్యాణమండపం నిర్మాణానికి మొత్తం 2560 శిలలు, శిల్పాలను కాకతీయలు ఉపయోగించారు. కళ్యాణమండపం ఎత్తు 9.5 మీటర్లు ఉండగా భూమిలో ఆరు మీటర్లలోతు పునాదులు ఉన్నాయి. కళ్యాణమండపంలో ఉత్తర–దక్షిణ దిక్కుల మధ్య దూరం 33.18 మీటర్లు, తూర్పు–పడమరల మద్య దూరం 33.38 మీటర్లుగా ఉంది. మంటపం మధ్యలో నాట్యం చేసేందుకు వీలుగా వేదిక ఉంటుంది. 400 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నిర్మాణం జరిగింది. తూర్పు ద్వారం గుండా రాజకుటుంబం, దక్షిణ ద్వారం గుండా ప్రజలు కళ్యాణమండపంలోకి ప్రవేశించి ఆటుపై రుద్రేశ్వరాలయంలో దైవదర్శనం చేసుకునేవారు.