అగ్నిప్రమాదంలో ఇద్దరు ఫైర్మెన్ మృతి
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఎన్ దేశాయ్, ఎస్డబ్ల్యు రాణే అనే ఇద్దరు పూర్తిగా కాలిపోయి మరణించినట్లు అగ్నిమాపక బృందం తెలిపింది. ముంబై కల్బాదేవి ప్రాంతంలోని ఓ నివాస భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని అదుపు చేసేందుకు ఫైరింజన్లు వెళ్లాయి.
అయితే అదే మంటల్లో ఫైర్ సిబ్బంది కూడా చిక్కుకున్నారు. దాదాపు 80 శాతం వరకు కాలిన గాయాలు అయిన వాళ్లను అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో భవనం శిథిలాల నుంచి బయటకు తీశారు. ఇదే ఘటనలో ముంబై చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ నెస్రికర్, మరో సీనియర్ అధికారి ఎస్.జి అమీన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ నవీముంబైలోని నేషనల్ బర్న్స్ సెంటర్కు తరలించారు.