సోనియా, రాహుల్ దిగ్బ్రాంతి
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కలిఖో పుల్ అకాలమరణం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కలిఖో పుల్ అరుణాచల్ ప్రదేశ్ కు తీరని లోటు అని మాజీ సీఎం నబమ్ తుకీ అన్నారు. ఈ కష్టకాలంలో పుల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు.
కలిఖో పుల్ మృతి తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ నాయకుడు నినొంగ్ ఎరింగ్ వ్యాఖ్యానించారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడంలేదన్నారు. సీఎం నివాసంలోనే పుల్ ఉంటున్నారని, ఒంటరితనం కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడివుండొచ్చని పేర్కొన్నారు. చివరిసారి ఆయనతో మాట్లాడినప్పుడు రాష్ట్రం పట్ల సానుకూలంగా మాట్లాడారని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు మరోసారి తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారన్న ఆశాభావాన్ని పుల్ వ్యక్తం చేశారని చెప్పారు.