Kalindi Kunj
-
నదిలో నీళ్లు చల్లుతున్నారు.. కొత్త టెక్నిక్ కాదు.. మరేంటి!
న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్యంపై నెటిజనులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాలుష్యం పెరిగిపోవడంతో యమునా నది విషపూరిత నురుగులతో నిండిపోయింది. ఇందులో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నీటిపై తేలియాడుతూ తెరతెరలుగా తరలివస్తున్న విషపూరిత నురుగును తొలగించడానికి ఢిల్లీ వాటర్ బోర్డు అధికారులు చేపట్టిన తాత్కాలిక చర్యలు అపహాస్యానికి గురయ్యారు. కాళింది కుంజ్ వద్ద నురగను అడ్డుకోవడానికి 15 పడవలను రంగంలోకి దించారు. వెదురు తడికలు అడ్డుకట్టి నురగను ఆపడానికి ప్రయత్నించారు. నదిలో పేరుకుపోయిన విషపు నురగను తొలగించడానికి పైపు ద్వారా నీటిని వెదచల్లారు. (చదవండి: సినిమా సెట్టింగో.. స్పెషల్ ఎఫెక్టో అనుకుంటున్నారా..!) ఈ చర్యలపై ట్విటర్లో నెటిజనులు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇదేదో కొత్త టెక్నిక్‌లా ఉందే.. మాకూ చెబితే ఊరి చెరువులను శుభ్రం చేసుకుంటామంటూ’ సెటైర్లు పేల్చారు. ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి భారతీయుడు తమ టేబుల్ ఫ్యాన్లను తెరిచిన కిటికీల వైపు చూపించాలని ప్రభుత్వం ఆదేశించింది’ అంటూ మరొకరు చురక అంటించారు. ‘RIP Science’ అంటూ ఇంకొరు సానుభూతి ప్రకటించారు. యమునా నదిలో కాలుష్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న పాలకులు, అధికారులపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కాలుష్యాన్ని తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని హస్తిన వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ఈ ఫొటో చూసి భ్రమ పడొద్దు.. ప్లీజ్!
న్యూఢిల్లీ : ఛత్ పూజ అనగానే గుర్తొచ్చేది ఉత్తర భారతీయులు. వేకువ జామునే నది వద్దకు చేరుకుని.. సూర్యుడు ఉదయించే వరకు పూజలు చేసి.. సూర్యదేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఇటీవల ఛత్ పూజలో భాగంగా యమునా నది తీరంలో మహిళలు పెద్ద ఎత్తున సూర్యదేవునికి పూజలు చేశారు. అయితే ఢిల్లీ సమీపంలో కలిండి కుంజ్ ప్రాంతంలో కనిపించిన కొన్ని దృశ్యాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. యమునా నదిలో విషపు రసాయనాలతో కూడిన నురగ మధ్యలోనే కొందరు మహిళలు పూజలు నిర్వహించారు. విషపు నురగ తమ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందనే అవగాహన లేక చాలా మంది అందులో దిగి తమ భక్తిని చాటుకున్నారు. మరికొంత మంది ఏది ఏమైనా పూజ చేసి తీరాలని విషపు నురగను సైతం లెక్కచేయకుండా తమ పని కానిచ్చారు. అయితే అలాంటి పరిస్థితుల్లో మహిళలు పూజలు నిర్వహిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫొటోలు చూసిన వారు మహిళలు తెల్లని మబ్బుల మధ్య నిల్చోని పూజ చేస్తున్నారమోనని భ్రమపడుతున్నారు. కానీ.. వారు కాలుష్యపు కోరల మధ్య సూర్యదేవుడికి పూజ చేస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దేశంలో కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి ఈ ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
18 ఏళ్లుగా ఆ రోడ్డు నిర్మాణం సా..గుతోంది!!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని రాజకీయ పార్టీలపై విమర్శలు రావడం మామూలే. అయితే 18 ఏళ్ల క్రితం మంజూరైన ఓ రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు పూర్తికాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. వివరాలు.. ఢిల్లీ, నొయిడా, ఫరిదాబాద్ను కలుపుతూ సాగే కాళింద్ కుంజ్ బైపాస్ ప్రాజెక్టు 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ ప్రాజెక్టుతో పాటు అదే ఏడాదిలో ఢిల్లీ మెట్రోకు కూడా కాంగ్రెస్ పాలకులు శంకుస్థాపన చేశారు. అయితే 277 కిలోమీటర్ల రైల్వే లైన్‌తో మెట్రో నిర్మాణం పూర్తి చేసుకోగా, 13.7 కిలోమీటర్ల కాళింద్ కుంజ్ బైపాస్ ప్రాజెక్టు మాత్రం అటకెక్కింది. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాడానికి 18 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టుని మంజూరు చేయగా, అంతకంతకూ పెరిగిన వాహనాల రద్దీలో దక్షిణ ఢిల్లీ ఊపిరి సలపకుండా ఉంది. అన్నీ ఆటంకాలే..! ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను వివరణ కోరగా.. ప్రాజెక్టు డిజైన్‌లో లోపాల కారణంగా నిర్మాణం ఆగిపోయిందని తెలిపింది. ఓక్లా పరిరక్షణ కేంద్రం(బర్డ్ శాంక్చూరీ) మీదుగా రోడ్డు వేయాల్సి రావడంతో నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయని పేర్కొంది. అయితే రీడిజైన్ అనంతరం మట్టి తవ్వకాలు, కొలతలు చేపట్టామని వివరించింది. కానీ, రోడ్డు నిర్మాణానికి అవరసమైన 43 ఎకరాలకు యూపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వనందున 2007లో మరోమారు పనులు నిలిచిపోయాయని తెలిపింది. కాగా, భూ అనుమతుల విషయమై 2017లో ఢిల్లీ ప్రభుత్వం యూపీ సర్కార్‌తో సంప్రదింపులు జరిపింది. -
మూడేళ్ల తర్వాత మోక్షం
నోయిడా: ప్రతిపాదిత బొటానికల్ గార్డెన్ (నోయిడా)-కాళిందీకుంజ్ (ఢిల్లీ) మార్గానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆమోదముద్ర వేశారు. దీంతో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ కారిడార్‌కు ఎట్టకేలకు మోక్షం లభిచింది. మూడో దశలో భాగంగా ప్రతిపాదించిన ఈ కారిడార్‌కు సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై సంతకం చేయాలని నోయిడా అథారిటీ చైర్మన్ రమారమణ్ను ఆయన ఆదేశించారు. యూపీ ప్రభుత్వం... ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)తో ఇందుకు సంబంధించి త ్వరలో ఓ ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. దీంతో ఇప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రా జెక్టు పనులు ఆగమేఘాలపై ముందుకు సాగనున్నాయి. ఈ విషయమై నోయిడా అథారిటీ చైర్మన్ రమారమణ్ మీడియాతో మాట్లాడుతూ డీఎంఆర్‌సీతో సంతకం చేయాల్సిన ఒప్పందానికి సంబంధించిన అన్ని లాంఛనాలను సిద్ధం చేశామన్నారు. అవగాహనపత్రం ముసాయిదాను ఆమో దం కోసం ఈ ఏడాది మే నెలలోనే ప్రభుత్వానికి పంపించామన్నారు. డీఎంఆర్సీ అధికారులతో సమావేశమవనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన తేదీని ఖరారు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పనులు మొదలుపెడతామన్నారు. కాగా ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 845 కోట్లు. 2016, మార్చినాటికల్లా దీనిని పూర్తి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 80 శాతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, 20 శాతం కేంద్ర ప్రభుత్వం భరించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీఎంఆర్సీ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది. ఈ విషయమై నోయిడా అథారిటీ చైర్మన్ రమారమణ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం డీఎంఆర్సీకి ఇప్పటికే దాదాపు రూ. 41 కోట్లు చెల్లించామన్నారు. సంబంధిత అధికారులు ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో సమగ్ర అధ్యయనం చేస్తారని తెలిపారు. సెక్టార్-51లో యార్డు నిర్మాణం కోసం డీఎంఆర్సీకి ఇప్పటికే 55 వేల చదరపు మీటర్ల స్థలాన్ని అప్పగించామన్నారు. కాగా ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. అవి బొటానికల్ గార్డెన్, ఓఖ్లా బర్డ్ శాంక్చురీ (నోయిడా), కాళిందీ కుంజ్ (ఢిల్లీ). ఈ మార్గంలో ఆరు, ఎనిమిది బోగీలు కలిగిన మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తారు. ఒక్కొక్క బోగీలో 1,756 నుంచి 2,352 మంది ప్రయాణించేందుకు వీలవుతుంది. కాగా మరో రెండు కారిడార్లను కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అవి నోయిడా సెంటర్-సెక్టార్ 62, నోయిడా-గ్రేటర్ నోయిడా. అయితే ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించాల్సి ఉంది