న్యూఢిల్లీ : ఛత్ పూజ అనగానే గుర్తొచ్చేది ఉత్తర భారతీయులు. వేకువ జామునే నది వద్దకు చేరుకుని.. సూర్యుడు ఉదయించే వరకు పూజలు చేసి.. సూర్యదేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఇటీవల ఛత్ పూజలో భాగంగా యమునా నది తీరంలో మహిళలు పెద్ద ఎత్తున సూర్యదేవునికి పూజలు చేశారు. అయితే ఢిల్లీ సమీపంలో కలిండి కుంజ్ ప్రాంతంలో కనిపించిన కొన్ని దృశ్యాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. యమునా నదిలో విషపు రసాయనాలతో కూడిన నురగ మధ్యలోనే కొందరు మహిళలు పూజలు నిర్వహించారు. విషపు నురగ తమ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందనే అవగాహన లేక చాలా మంది అందులో దిగి తమ భక్తిని చాటుకున్నారు. మరికొంత మంది ఏది ఏమైనా పూజ చేసి తీరాలని విషపు నురగను సైతం లెక్కచేయకుండా తమ పని కానిచ్చారు.
అయితే అలాంటి పరిస్థితుల్లో మహిళలు పూజలు నిర్వహిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫొటోలు చూసిన వారు మహిళలు తెల్లని మబ్బుల మధ్య నిల్చోని పూజ చేస్తున్నారమోనని భ్రమపడుతున్నారు. కానీ.. వారు కాలుష్యపు కోరల మధ్య సూర్యదేవుడికి పూజ చేస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దేశంలో కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి ఈ ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment