
దసరా, దీపావళికి స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయండి
గాంధీ జయంతి రోజు ఖాదీ వ్రస్తాలు ధరించండి
‘మన్ కీ బాత్’లో ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ ఉత్పత్తులతో పండుగలకు కొత్త శోభ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వదేశీ స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని, స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేసి ‘వోకల్ ఫర్ లోకల్’ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 126వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు.
రానున్న పండుగల వేళ స్వదేశీ వస్తువులనే ఉపయోగించుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ భగత్ సింగ్, గానకోకిల లతా మంగేష్కర్‌లకు వారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సేవలను ప్రధానమంత్రి కొనియాడారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే...
‘వోకల్ ఫర్ లోకల్’కు పెద్దపీట
అన్ని రంగాల్లో మనం స్వయం సమృద్ధి సాధించాలి. ఆత్మనిర్భరతే మన మంత్రం. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క ఖాదీ ఉత్పత్తి అయినా కొనుగోలు చేసి ధరించాలి. ఇది స్వదేశీ ఉత్పత్తి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలి. గత 11 ఏళ్లలో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరగడం మన ఆత్మనిర్భరతకు నిదర్శనం. యువ పారిశ్రామికవేత్తలు సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునికతను జోడించి అద్భుతాలు సృష్టిస్తున్నారు.
ఛట్ మహాపర్వ్‌కు అంతర్జాతీయ గుర్తింపు!
రాబోయే ఛట్ పూజ, విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కోల్‌కతా దుర్గా పూజ మాదిరిగా ఛట్ మహాపర్వ్‌ను కూడా యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్పించేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. తద్వారా ఈ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. పండుగల సమయంలో ప్రతి ఒక్కరూ కేవలం స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి. తద్వారా స్థానిక చేతివృత్తుల వారికి, పారిశ్రామికవేత్తలకు చేయూతనివ్వాలి.
భగత్‌సింగ్, లతా మంగేష్కర్‌కు నివాళులు
ఈ రోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతి. ఒకరు షహీద్ భగత్ సింగ్, మరొకరు మనందరి ప్రియమైన లతా దీదీ. భగత్ సింగ్ గుండెనిబ్బరం, ధైర్యసాహసాలు, దేశభక్తి మన యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఉరిశిక్షకు ముందు కూడా తనను, తన సహచరులను యుద్ధ ఖైదీలుగా పరిగణించి, తుపాకీతో కాల్చి చంపాలని బ్రిటిష్ వారికి లేఖ రాయడం భగత్‌సింగ్ అకుంఠిత ధైర్యానికి నిదర్శనం. లతా మంగేష్కర్ పాటలు భారతీయ సంస్కృతి, సంగీతానికి జీవనాడి. దేశభక్తి గీతాలతో ప్రజల్లో ఆమె ఎంతో స్ఫూర్తిని రగిలించారు.
సంఘ్ వందేళ్ల ప్రయాణం స్ఫూర్తిదాయకం
రానున్న విజయదశమి నాటికి రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)ను స్థాపించి 100 ఏళ్లు పూర్తి కానుండడం చాలా ప్రత్యేకం. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ సంఘ్ అసలైన బలాలు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు దేశమే ప్రథమం. దేశ సేవకే వారు తొలి ప్రాధాన్యం ఇస్తారు. సంఘ్ వందేళ్ల ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
Sharing this month's #MannKiBaat. Do hear!
https://t.co/oKMc16cIzt— Narendra Modi (@narendramodi) September 28, 2025
సాహస నారీమణుల సముద్ర యానం
భారత నౌకాదళానికి చెందిన ఇద్దరు సాహస మహిళా ఆఫీసర్లతో ప్రధానమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూప.. వీరిద్దరూ తెరచాప పడవపై సముద్రంలో ఎనిమిది నెలల పాటు ఏకధాటిగా 47,500 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టివచ్చారు. ‘నావిక సాగర్ పరిక్రమ’ యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. ‘‘ఈ యాత్ర మా జీవితాలను మార్చేసింది. 238 రోజుల పాటు మేమిద్దరమే పడవలో ఉన్నాం. మూడు అంతస్తుల భవనం అంత ఎత్తున ఎగసిపడే అలలను, అంటార్కిటికా వద్ద 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను, గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకున్నాం’’ అని వారు తమ అనుభవాలను మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. వారి సాహసాన్ని, టీమ్‌వర్క్‌ను ప్రధానమంత్రి అభినందించారు.