వోల్వోలో పొగలు.. ఉలిక్కిపడిన ప్రయాణికులు
అడ్డాకుల, న్యూస్‌లైన్: వోల్వో బస్సులో అకస్మాత్తు గా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెనుక వస్తున్న ఓ కారు డ్రైవర్ గమనించి అప్రమత్తం చేయడంతో తృటి లో ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కల్లడ ట్రావెల్స్ వోల్వో బస్సు కేరళలోని కొచ్చి నుంచి 32 మంది ప్రయాణికులతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరా బాద్ బయలుదేరింది.
మంగళవారం ఉదయం 10.30గంటలకు మార్గమధ్యంలోని మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే ఇంజన్లో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. వెనుక వస్తున్న ఓ కారు డ్రైవర్ గమనించి బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో డ్రైవర్ సుభాష్ వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికులను దించాడు. స్థానిక ఎల్అండ్టీ సిబ్బంది అగ్ని నిరోధక యంత్రంతో పొగలను నియంత్రించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంజన్ వద్ద ఉన్న డైనమో కాలిపోవడంతోనే పొగలు వెలువడినట్లు గుర్తించారు.