నేడు సమరం
కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అంతా సిద్ధమైంది. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కాగజ్‌నగర్ పట్టణంలోని హెచ్ఆర్డీ హాలులో పోలింగ్, కౌంటింగ్ చేపట్టనున్నారు. బరిలో ఏడు యూనియన్లు ఉండగా, ప్రధాన పోటీ ఐదు యూనియన్ల మధ్యే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు పోటీ పడుతుండటంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎస్పీఎం మజ్దూర్ యూనియన్(సీఐటీయు) తరఫున రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు పోటీలో ఉన్నారు. బీఎంఎస్ అనుబంధ ఎస్పీఎం వర్క ర్స్ యూనియన్ నుంచి బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లోల భట్టాచార్య పోటీలో ఉన్నారు.
హెచ్ఎంఎస్ అనుబంధ ఎస్పీఎం తెలంగాణ వర్కర్స్ యూనియన్ నుంచి టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన సోమవారం కాగజ్‌నగర్‌కు వచ్చి బహిరంగ సభ నిర్వహించి కార్మికులను కలుస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈయన తరపున ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి ప్రచారం నిర్వహించారు. ఎస్పీఎం నేషనల్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి ఐఎన్టీయుసి జాతీయ నేత జి.సంజీవరెడ్డి పోటీ చేస్తుండగా, ఈయన సోమవారం కాగజ్‌నగర్‌కు వచ్చి ఎస్పీఎం గేటు వద్ద కార్మికులను కలిసి అక్కడే నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈయన తరఫున మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన వర్గీయులు ప్రచారం నిర్వహించారు.
సిర్పూర్ తెలుగునాడు కార్మిక పరిషత్ నుంచి మాజీ ఎంఎల్సీ ప్రేంసాగర్‌రావు వర్గీయుడు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. ఈయన గెలుపు కోసం ఆదివారం ప్రేంసాగర్‌రావు కాగజ్‌నగర్‌లో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈయన తరఫున డీసీసీ నాయకులు విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేశ్గౌడ్తోపాటు స్థానిక నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఐఎన్టీయుసీ రాష్ట్ర అధ్యక్షురాలు రాపెల్లి విజయలక్ష్మి పోటీ చేస్తున్నారు.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఎస్పీఎం మిల్లులో బుధవారం జరిగే ఎన్నికలకు మిల్లు యాజమాన్యం, కార్మికశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లను చేశారు. మిల్లులోని సైకిల్ స్టాండ్‌లో నాలుగు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఒ క్కో బూత్‌లో 400 నుంచి 440 మంది ఓటర్లు ఓటును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల ఏర్పాట్లను డిప్యూటీ లేబర్ కమిషనర్ దండపాణి, కాగజ్‌నగర్ సహాయ కార్మికశాఖాధికారి మజ రున్నీసాబేగం పరిశీలించారు. మిల్లు యాజమాన్యం తరపున మిల్లు ఉపాధ్యక్షుడు బీసీ శర్మ, సీనియర్ పర్సనల్ మేనేజర్ డీటీ చౌదరి, అసిస్టెంట్ మేనేజర్ ఉదయ్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సందర్భం గా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.