కల్పరసకు తొలి అడుగు
తీతకు నడుంకట్టిన కొబ్బరి రైతులు
ప్రభుత్వ అనుమతిపై ఉప ముఖ్యమంత్రి రాజప్పకు కృతజ్ఞతలు
అమలాపురం : కొబ్బరి రైతుల దశ మార్చనున్న కొబ్బరి కల్పరస (కొబ్బరినీరా)కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దాని సేకరణకు కోనసీమ రైతులు నడుంకట్టారు. కొబ్బరి చెట్టు నుంచి శాస్త్రీయ పద్ధతిలో దానిని సేకరించేందుకు తొలి అడుగు వేశారు. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీపీసీఆర్ఐ) అందుబాటులోకి తెచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కల్పరస సేకరణకు అమలాపురం రూరల్ మండలం చిందాడగరువుకు చెందిన రైతు మట్ట నాగేశ్వరరావు బుధవారం తన తోటలో శ్రీకారం చుట్టారు. కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ (కేసీఎఫ్పీవో) సభ్యుడైరన నాగేశ్వరరావు తన తోటలో మొదటిగా మూడుచెట్ల నుంచి కల్పరససేకరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా పొత్తులకు నైలాన్ తాడుకట్టి, పొత్తును మసాజ్ చేస్తున్నారు. ఇలా వారం రోజులు చేసి తరువాత దీని నుంచి కల్పరసను సేకరిస్తామని నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. 2015లో కేరళలోని కాసరఘోడ్లో సీపీసీఆర్ఐ కల్పరస సేకరణపై ఇచ్చిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రక్రియను రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు కన్వీనర్ అడ్డాల గోపాలకృష్ణ, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మట్టా మహాలక్ష్మి ప్రభాకర్ పర్యవేక్షించారు.