కల్ప వృక్షంపై వరసిద్ధుడి దివ్యతేజం
– వీక్షించి మొక్కులు తీర్చుకున్న భక్తులు
కాణిపాకం(ఐరాల):
సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి వారు గురువారం రాత్రి కల్ప వృక్షంపై కాణిపాకం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉత్సవానికి ఆలయ ఈఓ పూర్ణచంద్రరావుతోపాటు అర్చకులు, సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారి మూల విగ్రహనికి ప్రత్యేక పంచామృతాధిభిషేకాలు నిర్వహించి విభూది అలంకరణ చేశారు.అనంతరం దూపదీప నైవేద్యాలు సమర్పించి వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూజలు నిర్వహించారు. రాత్రి సిద్ధి బుద్ధి సమేత ఉత్సవమూర్తులను ఆలయ అలంకార మండపంలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి విశేషాలంకరణ చేశారు. అక్కడి నుంచి అధికార బృందం పల్లకిపై స్వామివారిని వేంచేపు చేసి, కల్పవృక్ష వాహనంపై అధిష్టింప చేశారు. ఉభయకర్తల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మంగళవాయిద్యాలు, మేళతాళ ధ్వనుల నడుమ కాణిపాకం మాడ వీధులతో పాటూ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను వీక్షించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ కేశవ రావు, ఏసీ వెంకటేశు, ఈఈ మురళీ బాలకృష్ణ, డీఈఈ సునీల్ బాబు, సూపరింటెండెంట్ రవీంద్ర, ఇన్స్పెక్టర్లు మల్లికార్జున, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.