వైభవంగా ‘కాళూబాబా’ ఉత్సవాలు
ఆకట్టుకున్న గిరిజనుల నృత్యాలు
సంతానం కోసం మహిళల వేడుకోలు
ఉత్సవాల్లో పాల్గొన్న ఖేడ్, జుక్కల్ ఎమ్మెల్యేలు
వేల సంఖ్యలో పాల్గొన్న గిరిజనులు
కంగ్టి: మండలంలోని తడ్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎడ్లరేగడి తండాలోని జ్వాలాముఖి కాళుబాబా ఉత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలు ఏటా ఆశ్వాయుజ మాసంలోని మొదటి మంగళవారం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ నిత్యపూజారి మంగళ్‌చంద్ మహారాజ్, జవహర్ మహారాజ్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి.
సోమవారం రాత్రి నుంచి కొనసాగిన గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాకు చెందిన గిరిజనులతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, గాంధారీ, కామారెడ్డి, బాన్సువాడ తదితర ప్రాంతాల నుంచి దాదాపు 5 వేలకు పైగా గిరిజనులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. నృత్యాల్లో దాదాపు 40కి పైగా బృందాలు పాల్గొన్నాయి.
బుధవారం మధ్యాహ్నం వరకు వేడుకలు, నృత్యాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. నృత్యాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు మంగల్‌చంద్ మహారాజ్ పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు
ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే పాల్గొని జ్వాలాముఖి కాళుబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవునెయ్యితో ఆలయం ఆవరణలో హోమం నిర్వహించారు. సంతానం లేని మహళలకు హోమంలో వేసిన చెరుకు గడలు ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం.
దీంతో అధిక సంఖ్యలో మహిళలు ప్రసాదం కోసం పోటీపడ్డారు. కోరికలు తీరిన దాదాపు 100 మంది ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. వసతి కోసం సత్రం ఏర్పాటు చేయడం విశేషం.
ఉత్సవాల కోసం భారీగా నిధులు
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే మాట్లాడుతూ.. సేవాలాల్ ఉత్సవాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి నిర్వహింస్తుందన్నారు. దీంతో పాటు సేవాలాల్ పూజారులకు తెలంగాణ ప్రభుత్వం గౌరవవేతనం చెల్లిస్తోందని గుర్తుచేశారు.
కార్యక్రమంలో కోట ఆంజనేయులు, నారాయణ, దత్తుసేఠ్, పండరి, రమేశ్, మాణిక్‌రెడ్డి, రాజుపటేల్, శివాజీరావు, సాయాగౌడ్, సిద్ధు, రాజప్ప, సంజు, రాములు, వెంకట్రాంరెడ్డి, విశ్వనాథ్, తహసీల్దార్ రాజయ్య, ఎస్సై నానునాయక్, ఎంపీడీఓ మధుసూదన్, పిట్లం మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, నర్సాగౌడ్, వాసరి రమేశ్, ప్రతాప్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.