వరదకాల్వ నీటి కోసం లొల్లి
రెండు వర్గాలుగా విడిపోయిన వైనం
మెట్‌పల్లిరూరల్ : వరదకాల్వ నీటి కోసం సమీప గ్రామాల మధ్య లొల్లి మెుదలైంది. తమ గ్రామానికి నీళ్లు విడుదల చేయాలంటే తమకు విడుదల చేయాలంటూ శనివారం ఆందోళనకు దిగారు. అధికారులు సముదాయించడంతో శాంతించారు. జగ్గాసాగర్, రామలచ్చక్కపేట, ఆత్మనగర్, ఆత్మకూర్, మెట్లచిట్టాపూర్, ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ ఓ వర్గంగా, కోరుట్ల పట్టణంలోని తాళ్లచెరువు ఆయకట్టు రైతులతోపాటు మండలంలోని యెఖీన్‌పూర్, మెట్పల్లి మండలంలోని కొండ్రికర్ల, కోనరావుపేట రైతులు రెండోవర్గంగా ఏర్పడ్డారు. మండల పరిషత్‌లో వాదోపవాదనలకు దిగారు. వరద కాలువ అధికారులు, రైతు నాయకులతో స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో చర్చించుకోవాలని, అక్కడకు వారిని పంపించారు. చర్చల అనంతరం వరద కాలువ సీఈ అనిల్‌కుమార్ మాట్లాడుతూ అన్ని గ్రామాల రైతుల కోరికలను మన్నిస్తామని, వరద కాలువ నియమనిబంధనలు, పాత రికార్డులు, చట్టాలను పరిశీలించి ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో ఎస్ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ సుధాకిరణ్, డీఈఈలు రూప్లానాయక్, తబుస్సుంభాను, ఏఈ అరుణ్, మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, మాజీ ఎంపీపీ పాలెపు నీల, బండలింగాపూర్ ఎంపీటీసీ కందిరి ప్రతాప్‌రెడ్డి, మెట్లచిట్టాపూర్ సింగిల్‌విండో చైర్మన్ శంకర్‌రెడ్డి, నాయకులు ఇల్లెందుల శ్రీనివాస్, గడ్డం రాజరెడ్డి, సురేష్, మెహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.