kalwakurthy lift scheme
-
చారిత్రక అన్యాయాలను సరిదిద్దాలి
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేంద్రం రెండు విభాగాలుగా గెజిట్ నోటిఫికేషన్లో పొందుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సరి చేయాలని, గెజిట్ నోటిఫికేషన్ నుంచి కల్వకుర్తి రెండో భాగాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఒకే విభాగంగా పొందుపర్చాలంటూ నీటిపారుదల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.మురళీధర్ ఆదివారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు మరోసారి లేఖ రాశారు. 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 25 టీఎంసీల నీటి తరలింపు సామర్థ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కాంపోనెంట్–1గా, నీటి తరలింపును 40 టీఎంసీలకు పెంచడంద్వారా ఆయకట్టును 3.65 లక్షల ఎకరాలకు పెంచేందుకు తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన ప్రాజెక్టు విస్తరణ పనులను కాంపోనెంట్–2గా గెజిట్ నోటిఫికేషన్లోకేంద్రం పేర్కొంది. ఒకే ప్రాజెక్టును రెండు విభాగాలుగా చూపడం సరికాదని లేఖలో తప్పుబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టును 2.5 లక్షల ఎకరాల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచారని, నీటి కేటాయింపులను ఇందుకు అనుగుణంగా పెంచలేదని స్పష్టం చేశారు. ఆయకట్టు పెంచుతూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవోలు సైతం జారీ చేసిందని గుర్తుచేశారు. అప్పట్లో పెంచిన ఆయకట్టుకే తెలంగాణ ప్రభుత్వం సరిపడా నీటి కేటాయింపులు చేసిందని, కొత్తగా ఆయకట్టు పెంచలేదన్నారు. కొత్త వనరుల నుంచి నీటిని తీసుకోవడం లేదన్నారు. మా ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లోవే.. ఏపీవి కావు! శ్రీశైలం జలాశయంలో 800కుపైగా అడుగుల వద్ద నుంచి నీటిని తోడేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల నిర్మిస్తామని 2006లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సమర్పించిందని తెలంగాణ గుర్తుచేసింది. 885 అడుగులపైన నీటిమట్టం నుంచి నీటిని తోడుకొనేలా గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రినీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను డిజైన్ చేసినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సమర్పించిందని పేర్కొంది. కల్వకుర్తి ఎత్తిపోతల కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టే కావడంతో అప్పట్లో శ్రీశైలం జలాశయంలోని 800 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి నీటిని తోడేలా డిజైన్ చేశారని తెలిపింది. పరీవాహక ప్రాంతం వెలుపలి ప్రాజెక్టులు కావడంతో గాలేరు–నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ వంటి ఆంధ్ర ప్రాజెక్టులను శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగుల నుంచి నీటిని తీసుకొనేలా డిజైన్ చేశారని స్పష్టం చేసింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సైతం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇదే కారణంగా 800కుపైగా అడుగుల నుంచి నీటిని తోడుకొనే విధంగా డిజైన్ చేసినట్లు వివరించింది. 75 శాతం నిల్వ ఆధారిత నికర జలాలను కల్వకుర్తికి కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్–2 ముందు వాదించామని తెలిపింది. గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులకు మిగులు జలాలనే ఏపీ కోరిందని, 75 శాతం నిల్వ ఆధారిత నికర జలాలు కేటాయించాలని కోరలేదని తెలిపింది. -
ఆశల వరి.. పండాలి సిరి
గోపాల్పేట : జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) జలాలు పుష్కలంగా పారుతున్నాయి. కరువు నేలకు జలసవ్వడి సంతరించుకుంది. యాసంగిలో వేరుశనగ, వరి సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న 24గంటల కరెంట్ కూడా మరింత దోహదపడింది. కేఎల్ఐ జలాలు గోపాల్పేట, రేవల్లి, పాన్‌గల్, ఖిల్లాఘనపురం మండలాలకు ఉరకలెత్తుతున్నాయి. ఇప్పటికే సుమారు 60చెరువులు, కుంటలు నీటితో నిండాయి. మరికొన్ని ప్రాంతాల్లో భీమా సాగునీటి ఆధారంగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. జనవరి 31వరకే వరినాట్లు వేసేందుకు గడువు ముగిసింది. ఇప్పటివరకు 22,400ఎకరాల్లో వరిసాట్లు చేశారు. సాధారణ విస్తీర్ణం 23,300 ఎకరాలు కాగా, 33వేల ఎకరాలకు పెరగవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 35,115 ఎకరాల్లో వరి సాగుచేయగా ఇప్పుడు అదనంగా మూడువేల ఎకరాలు పెరుగుతుందని చెబుతున్నారు. నిరంతర విద్యుత్ తోడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తుంది. గతంలో ఇచ్చే 9గంటల కరెంట్ కోసం రాత్రింబవళ్లు పొలాల వద్ద పడిగాపులుగాసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డారు. కానీ ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించకపోవడంతో బోర్లపై భారం పడింది. దీనిపై ట్రాన్స్‌కో అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. పుష్కలంగా నీళ్లు కుంట కింద వరిసాగు చేశాను. గతేడాది కుంటకు నీళ్లు రాకపోవడంతో శిస్తు చేయలేదు. ఈ సారి కేఎల్ఐ నీళ్లు రావడంతో నాట్లు వేశాను. బోరు ఆపకుండా నీళ్లు పోస్తుంది. -కృష్ణనాయక్, గోపాల్పేట రైతు సూచనలు పాటించాలి రబీలో నాట్లు వేసుకునే గడువు జనవరి 31తో ముగిసింది. అయినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరినాట్లు వేస్తున్నారు. ఇప్పటికే 22,400ఎకరాల్లో తెలంగాణ సోనా, బతుకమ్మ, 1010రకం సాగుచేశారు. ఇది కాస్తా 38వేల ఎకరాల వరకు చేరుతుంది. ఆలస్యంగా సాగుచేస్తే పంటలకు ఎండాకాలంలో నీటి సమస్య, తెగుళ్లు సోకే ప్రమాదం ఉంది. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.– నూతన్‌కుమార్, టెక్నికల్ ఏడీఏ వనపర్తి జిల్లా -
8 గంటలు.. 100 కి.మీ
‘కల్వకుర్తి’ కాలువ పనులను పరిశీలించిన హరీశ్‌రావు పనుల జాప్యం.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం సాక్షి, నాగర్‌కర్నూల్: భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు గురువారం రోజంతా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువ పనులను పరిశీలించారు. ఏకంగా 8 గంటల పాటు ఆయన కాలువల వెంబడి తిరిగారు. పనులతీరు, నాణ్యతను పరిశీ లించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా రంగారెడ్డిగూడ నుంచి.. నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి గట్టు వరకు ఆయన పరిశీలన జరిగింది. వంద కిలోమీటర్ల మేర కాలువల స్థితిగతులను పరిశీలించారు. గ్రామస్తుల సమస్యలు వింటూ ముందుకు సాగారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ 160 కి.మీ.మేర విస్తరించి ఉంది. కాలువల వెంట పర్యటించిన ఆయనకు ఆక్వాటెక్ బ్రిడ్జి నిర్మాణాలు, యూటీలు, డబుల్ లైన్ రోడ్డు బ్రిడ్జి, ఓటీల పనులు పెండింగ్‌లో ఉండటం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులకు నీరెలా అందిస్తామని ప్రశ్నించారు. జూలై చివరి నాటికి చివరి ఆయకట్టుకు నీరందించాలని నీటి పారుదల సీఈ ఖగేందర్‌ను ఆదేశించారు. గుడిపల్లిగట్టు వద్ద కల్వకుర్తి, అచ్చం పేట నియోజకవర్గాలకు సాగునీరు అం దించడంపై ఉన్నతా ధికారులతో సమీ క్షించారు. 2 నెలల్లో మిగిలిపోయిన పనులను పూర్తిచేసి సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆయన వెంట పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ఏడాదిలోనే ఆర్డీఎస్ కాలువల్లో తుమ్మిళ్ల నీళ్లు సాక్షి, గద్వాల: ఈ ఏడాదిలోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల ను పూర్తిచేసి ఆర్డీఎస్ కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని హరీశ్‌రావు అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాలలోని అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడా రు. ఆర్డీఎస్ సమస్య శాశ్వత పరిష్కారానికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతోపాటు 3 రిజర్వాయర్లు నిర్మి స్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం 2 లక్షల 13 వేల క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసిందని, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వని కంపెనీలపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు.